సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుమ్మడి వృశాలి సత్తా చాటింది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ వృశాలి (ఏపీ) 21–15, 21–18తో మూడోసీడ్ ద్రితి యతీశ్ (కర్ణాటక)పై విజయం సాధించింది. జూనియర్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ ఎం. తరుణ్, ఏపీ క్రీడాకారిణి కె. ప్రీతి విజేతలుగా నిలిచారు. బాలుర సింగిల్స్ టైటిల్ పోరులో ఎం. తరుణ్ (తెలంగాణ) 15–21, 21–14, 21–16తో టాప్ సీడ్ కె. సతీశ్ కుమార్ (తమిళనాడు)కు షాకిచ్చాడు. బాలికల సింగిల్స్ తుదిపోరులో ప్రీతి (ఏపీ) 21–13, 14–21, 21–15తో టాప్‌సీడ్ త్రిషా హెగ్డే (కర్ణాటక)ను ఓడించింది. బాలుర డబుల్స్‌లో తెలంగాణ జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్–పి. విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) జంట 21–14, 21–9తో భార్గవ్ గౌడ–శమంత్ రావు (కర్ణాటక) జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. మరోవైపు పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహించిన తెలుగు అమ్మాయి కవిప్రియ రెండు టైటిళ్లను దక్కించుకుంది. సీనియర్స్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఎస్ కవిప్రియ–సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి) జోడీ 21–11, 23–21తో లోకేశ్ విశ్వనాథ్–తనుశ్రీ (తమిళనాడు) జంటపై నెగ్గింది.
జూనియర్ బాలికల డబుల్స్‌లో ఆగ్నస్ స్వప్న–కవిప్రియ (పాండిచ్చేరి) ద్వయం 21–15, 21–14తో జనని–శ్రుతి (కర్ణాటక) జంటపై గెలిచి విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్‌కుమార్–శ్వేత (తమిళనాడు) జంట టైటిల్‌ను సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కర్ణాటకకు చెందిన నిఖిల్ శ్యామ్ శ్రీరామ్, డబుల్స్‌లో ప్రకాశ్ రాజ్–వైభవ్ (కర్ణాటక) జోడీ, మహిళల డబుల్స్‌లో హరిత–రిజా ఫర్హాత్ (కేరళ) జంట విజేతలుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment