చెమ్స్‌ఫోర్డ్: కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆడాల్సిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత టీమ్ మేనేజ్‌మెంట్ మూడు రోజులకే కుదించింది. మధ్యాహ్నం ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్ ముగిశాక టీమ్ మేనేజ్‌మెంట్ మైదానాన్ని పరిశీలించింది. చెత్త పిచ్, అధ్వాన్నమైన అవుట్ ఫీల్డ్‌లపై అసంతృప్తి వెలిబుచ్చిన టీమిండియా మూడు రోజులే ‘ప్రాక్టీస్’ చేస్తామని చెప్పేసింది. ఈ నాటకీయ పరిణామాలతో ఆతిథ్య ఇంగ్లండ్ బోర్డు చేసేదేమీ లేక సరేనంది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పిచ్ నాణ్యత, మైదానం పరిస్థితిపై చర్చించారు. పిచ్‌పై పచ్చిక అసాధారణంగా ఉండటంతో పాటు అవుట్ ఫీల్డ్‌లో ఆటగాళ్లు గాయాలబారిన పడే ప్రమాదముందని అంచనాకు వచ్చారు. గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడాక చివరకు మ్యాచ్‌ను కుదించేందుకే మొగ్గుచూపారు. ప్రాక్టీస్‌కు అందుబాటులో ఉంచిన రెండు పిచ్‌లు పేలవంగా ఉండటంతో భారత్ అసంతృప్తి గురైనట్లు తెలిసింది.
మూడు రోజులకు కుదించడమనేది ఏకగ్రీవ నిర్ణయమని రవిశాస్త్రి చెప్పారు. దీంతో ఈ సన్నాహక పోరు ‘ఫస్ట్‌క్లాస్’ అర్హత కోల్పోయింది. క్రికెట్ నిబంధనల ప్రకారం నాలుగు రోజుల మ్యాచ్‌లనే ‘ఫస్ట్‌క్లాస్’ మ్యాచ్‌లుగా పరిగణిస్తారు. గణాంకాలను నమోదు చేస్తారు. ఇప్పుడీ మ్యాచ్ పుటలకెక్కేందుకు దూరమైంది. అయితే టెస్టు జట్టుకు ఎంపికైన మొత్తం 18 మంది ఈ మ్యాచ్ బరిలోకి దిగుతారు. మంగళవారం భారత ఆటగాళ్లు రెండు గ్రూపులుగా వచ్చి నాలుగు గంటల పాటు ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ కోహ్లి, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌లు స్లిప్ ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టారు. క్యాచ్‌ల్ని ప్రాక్టీస్ చేశారు. కోచ్ సూచనల మేరకు ఓపెనర్ ధావన్ షార్ట్‌బాల్స్‌ను ఎదుర్కొనే పనిలో పడ్డాడు. లోకేశ్ రాహుల్ ప్రాక్టీస్ ముగిశాక పుజారా బ్యాటింగ్‌కు దిగాడు. మిగతా ఆటగాళ్లంతా రెండో విడతలో వచ్చి నెట్స్‌లో చెమటోడ్చారు. ఇషాంత్ శర్మ, బుమ్రా, కరుణ్ నాయర్, అశ్విన్, జడేజా రెండో విడతలో వచ్చి సన్నాహాల్లో పాల్గొన్నారు.
4 కాదు... 3 రోజులే ఈ ‘ప్రాక్టీస్’
Published Wed, Jul 25 2018 1:04 AM | Last Updated on Wed, Jul 25 2018 1:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment