భారత్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందే న్యూజిలాండ్ జట్టుకు షాక్ తగిలింది. అంతగా అంతర్జాతీయ అనుభవం లేని బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ బౌలర్ల ఉచ్చులో పడి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. అటు పేస్.. ఇటు స్పిన్‌ను ఎదుర్కొనేందుకు తంటాలు పడడంతో మున్ముందు కోహ్లి సేనతో పోరు ఎలా ఉండబోతోందో తెలిసొచ్చింది. అంతకుముందు టీనేజి సెన్సేషన్ పృథ్వీ షా తన అద్భుత బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటుకోగా.. రాహుల్, కరుణ్ అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించారు..
ముంబై: మూడు వన్డేల సిరీస్ కోసం జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మంగళవారం బ్రబౌర్న్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు అన్ని విభాగాల్లో చెలరేగి కివీస్‌ను వణికించింది. టీమిండియా భవిష్యత్ తారగా చెప్పుకుంటున్న 17 ఏళ్ల పృథ్వీ షా (80 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొని ఆడిన తీరు ఆకట్టుకుంది. అతడికి తోడు కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (64 బంతుల్లో 78; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బోర్డు ఎలెవన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 295 పరుగుల భారీ స్కోరు సాధించింది. బౌల్ట్‌కు ఐదు వికెట్లు దక్కాయి. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే మైదానంలో గురువారం జరుగుతుంది.
సూపర్ పృథ్వీ...
ఓపెనర్‌గా బరిలోకి దిగిన ‘లోకల్ బాయ్’ పృథ్వీ తొలిసారిగా ఓ సీనియర్ అంతర్జాతీయ జట్టును ఎదుర్కొన్నా ఎలాంటి తడబాటు లేకుండా ఆడాడు. ప్రారంభంలో రాహుల్ కాస్త వేగంగా ఆడినా ఆ తర్వాత షా దూకుడు కనిపించింది. పేసర్ ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో కవర్ మీదుగా తను అద్భుత సిక్సర్ బాదాడు. అటు 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ అవుటైనా అది నోబాల్‌గా తేలింది. వీరిద్దరూ 62 బంతుల్లోనే తమ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం జత చేసిన అనంతరం ఈ జోడి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత కరుణ్ నాయర్ తన లాఫ్టెడ్ డ్రైవ్‌లతో కివీస్ బౌలర్లపై దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 47.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లాథమ్ (63 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా విలియమ్సన్ (49 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మూడు బంతుల వ్యవధిలో ఎడమచేతి స్పిన్నర్ షాబాజ్ నదీమ్ రెండు వికెట్లు తీయడంతో ఓ దశలో కివీస్ 204 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. చివర్లో గ్రాండ్‌హోమ్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడినా ఫలితం లేకపోయింది. లెఫ్టార్మ్ మీడియం పేసర్ జయదేవ్ ఉనాద్కట్, నదీమ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment