వార్నర్‌ సెంచరీ   | Warner Century : Australia 244/3 | Sakshi
Sakshi News home page

వార్నర్‌ సెంచరీ  

Published Wed, Dec 27 2017 12:42 AM | Last Updated on Wed, Dec 27 2017 12:42 AM

Warner Century : Australia 244/3 - Sakshi

డ్రింక్స్‌ బ్రేక్‌కు ముందు ఓవర్‌. సెంచరీకి పరుగు దూరంలో వార్నర్‌ (99). కరన్‌ వేసిన 41వ ఓవర్‌ ఐదో బంతిని వార్నర్‌ గాల్లోకి లేపాడు. మిడాన్‌లో బ్రాడ్‌ సునాయాస క్యాచ్‌ పట్టేశాడు. అంతే... ఓపెనర్‌ నిరాశగా వెనుదిరుగుతుంటే... అరంగేట్రం బౌలర్‌ కరన్‌ తొలి వికెట్‌ సాధించిన  ఆనందంలో, సహచరులంతా సంబరంలో. కానీ...అపుడే ఫీల్డ్‌ అంపైర్‌ ధర్మసేన నోబాల్‌ సిగ్నలిచ్చాడు. వార్నర్‌ను క్రీజులోకి పిలిచాడు.   ఆ తర్వాత బంతికే అతడు సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పుడు సంబరం  వార్నర్‌ది. సంతోషం ఆసీస్‌ది.   

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ‘బాక్సింగ్‌ డే’ టెస్టులోనూ శుభారంభం చేసింది. యాషెస్‌ సిరీస్‌లో మంగళవారం మొదలైన నాలుగో టెస్టులో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (103; 13 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (65 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో శతక సాధనలో ఉన్నాడు. మొదటి రోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లు ఆడి 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు నుంచే ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. రోజంతా మందకొడిగా సాగిన ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ సగటున ఓవర్‌కు 2.74 రన్‌రేట్‌తో పరుగులు చేస్తే... 89 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ బౌలర్లు మూడే వికెట్లు తీయగలిగారు.  

వార్నర్‌కు కలిసొచ్చినా... 
టాస్‌ నెగ్గిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. బాన్‌క్రాఫ్ట్‌ (26; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన వార్నర్‌ తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చాడు. కలిసొచ్చిన ‘నోబాల్‌’తో టెస్టుల్లో 21వ శతకం సాధించినా... ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. అండర్సన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ స్మిత్, షాన్‌ మార్‌‡్ష (31 బ్యాటింగ్‌; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీళ్లిద్దరు అభేద్యమైన నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో ‘బాక్సింగ్‌ డే’ టెస్టును తిలకించేందుకు తొలి రోజు 88,172 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 244/3 (వార్నర్‌ 103, స్మిత్‌  65 బ్యాటింగ్, షాన్‌ మార్‌‡్ష 31 బ్యాటింగ్‌; బ్రాడ్‌ 1/41, అండర్సన్‌ 1/43).   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement