అందుకే వద్దనుకున్నాం: కోహ్లి  | We are ready for South Africa, says Virat Kohli | Sakshi
Sakshi News home page

అందుకే వద్దనుకున్నాం: కోహ్లి 

Published Sun, Dec 31 2017 1:08 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

We are ready for South Africa, says Virat Kohli - Sakshi

కేప్‌టౌన్‌: ప్రాక్టీస్‌ మ్యాచ్‌ పిచ్‌తో టెస్టు సిరీస్‌కు ఒరిగేదేమీ లేనందునే వార్మప్‌ మ్యాచ్‌ వద్దన్నామని భారత కెప్టెన్‌ కోహ్లి వివరణ ఇచ్చాడు. శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌ ముగిశాక అతను మీడియాతో మాట్లాడుతూ... ‘న్యూలాండ్స్‌ (తొలి టెస్టు వేదిక) పిచ్‌కు వార్మప్‌ పిచ్‌కు అసలే మాత్రం సంబంధం లేదు. కనీసం 15 శాతమైనా సరిపోలని పిచ్‌ అది. అందుకే వద్దన్నాం. ఇలాంటి ప్రాక్టీస్‌ పోటీల కంటే నెట్స్‌లో చెమటోడ్చడమే మేలనుకున్నాం. పైగా సిరీస్‌కు ముందు మానసిక ప్రశాంతత కూడా అవసరమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కోహ్లి చెప్పాడు. గత పర్యటన (2013–14)లో ఆడిన వారిలో 13 మంది ఈసారి వచ్చారని... అనుభవం గడించిన వీరంతా తప్పకుండా నాణ్యమైన ఆట ఆడతారని విశ్వాసాన్ని వెలిబుచ్చాడు.

‘ఇక్కడి పిచ్‌లు బౌన్సీ ట్రాక్‌లని మా వాళ్లందరికీ తెలుసు. తప్పకుండా ఈసారి సిరీస్‌ సాధించే సత్తా మాలో ఉందని నమ్మకంతో ఉన్నాను’ అని కోహ్లి తెలిపాడు.  ఇది భారత్, సఫారీ సమరమని... డివిలియర్స్‌–కోహ్లి పోరు కానే కాదన్నాడు. తన బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ సహచరుడంటే తనకెంతో గౌరవమన్నాడు. దక్షిణాఫ్రికాతో క్లిష్టమైన సవాల్‌కు  టీమిండియా సిద్ధంగా ఉందని భారత చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. ‘ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో నాకు భారతే మేటి జట్టుగా కనబడుతోంది. నాలుగేళ్ల క్రితం ఈ మాట అడిగితే అప్పుడు కాదని చెప్పేవాణ్ని. కానీ ప్రస్తుత జట్టు అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. 

ధావన్‌ అవుట్‌: సిరీస్‌కు ముందే భారత్‌కు తొలిదెబ్బ తగిలింది. రెగ్యులర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయంతో కేప్‌టౌన్‌ టెస్టుకు దూరమయ్యాడు. గాయంతోనే అక్కడికి వెళ్లిన అతను పూర్తిగా కోలుకోకపోవడం వల్లే తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడని జట్టు వర్గాలు వెల్లడించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement