'మినీ ఐపీఎల్ ఆలోచన లేదు'
కోల్ కతా: చాంపియన్ లీగ్ (సీఎల్) ట్వంటీ 20 ను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని సోమవారం స్పష్టం చేశారు. గత వారం చాంపియన్స్ లీగ్ టి20ని పక్కనపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం రూమర్లు మాత్రమేనన్నారు. ప్రస్తుతం తాము చాంపియన్ లీగ్ కు మరింత మెరుగులు దిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఠాకూర్ పేర్కొన్నారు. క్రికెట్ లో ఉన్న ఆదరణను బట్టి ఇప్పటివరకూ చాంపియన్ లీగ్ ను ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియాలలో మాత్రమే నిర్వహించామన్నారు. అయితే మరిన్ని దేశాలలో చాంపియన్ లీగ్ ను విస్తరించి క్రికెట్ కు మరింత వన్నె తేవాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. 'మేము ఇప్పటికీ సీఎల్ ట్వంటీ 20కే కట్టుబడి ఉన్నాం. త్వరలో దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఐపీఎల్ దిగ్విజయంగా ముగిసింది. మినీ ఐపీఎల్ పై ఎటువంటి ఆలోచన లేదు. ఇక సీఎల్ ట్వంటీ 20 పైనే మా దృష్టి' అని ఠాకూర్ స్పష్టం చేశారు.చాంపియన్ లీగ్ కు ముగింపు పలుకుతున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు.
ఆయా దేశాల్లోని టి20 లీగ్ విజేతలతో గత ఆరేళ్లుగా సీఎల్‌టి20 జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఈవెంట్ స్థానంలో సెప్టెంబర్‌లో కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.