'ధోని కోసం అస్త్రాలు సిద్ధం చేయాలి'
మొహాలి: తమతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిలు కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకున్నారని న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ తెలిపాడు. ప్రధానంగా ధోని క్రీజ్లోకి వచ్చిన మరుక్షణమే తమపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించడంతోనే మ్యాచ్పై మెల్లగా పట్టుకోల్పోయమన్నాడు. అతనికి జతగా విరాట్ కోహ్లి కూడా అద్భుతమైన ఆట తీరుతో రాణించడంతో తమ వద్ద సరైన సమాధానం లేకుండా పోయిందన్నాడు. తాము ఎంత గొప్పగా బౌలింగ్ వేసినప్పటికీ, వరల్డ్ అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్లైన కోహ్లి, ధోనిల ముందు తమ వ్యూహాలు పని చేయలేదన్నాడు. ఈ మ్యాచ్లో తాము బౌలింగ్ సరిగా వేయకపోవడంతోనే ఓటమి చెందామనడం ఎంతమాత్రం సరైనది కాదని నీషమ్ పేర్కొన్నాడు.
'మేము ఈ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ వేశాం. అయినప్పటికీ ధోని-కోహ్లిల జోడి అసాధారణమైన ఆట తీరును కనబరించింది. ప్రత్యేకంగా ధోని ఆరంభం నుంచి షాట్లతో చెలరేగాడు. తదుపరి మ్యాచ్ ల్లో ధోని కోసం తగిన అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి' అని నీషమ్ తెలిపాడు. తాము వరుస విరామాల్లో కీలక వికెట్లను చేజార్చుకోవడంతో స్కోరు బోర్డుపై సాధ్యమైనన్ని పరుగుల్ని ఉంచలేకపోయామన్నాడు. తమ బ్యాటింగ్ లో 50వ ఓవర్ వరకూ క్రీజ్ లో ఉండి ఉంటే మరిన్ని పరుగుల వచ్చేవని, కాకపోతే చివరి బంతి వరకూ ఆడకుండా ఆలౌట్ కావడంతో అనుకున్న పరుగుల్ని సాధించలేకపోయామని నీషమ్ అన్నాడు.