భారత్‌కు ఊరట
చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీపై 3-2తో గెలుపు
కీలక మ్యాచ్‌ల్లో నెగ్గిన గురుసాయిదత్, శ్రీకాంత్
న్యూఢిల్లీ: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... థామస్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నాకౌట్ అవకాశాలను కోల్పోయిన భారత పురుషుల జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. జర్మనీతో బుధవారం జరిగిన ఈ పోటీలో టీమిండియా 3-2తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 18వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 21-18, 18-21, 21-18తో ప్రపంచ 13వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్‌ను ఓడించి శుభారంభం అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 15-21, 6-21తో మైకేల్ ఫుచస్-ష్కోట్లెర్ జోడి చేతిలో ఓడింది.
దాంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో భారత కెప్టెన్, ప్రపంచ 21వ ర్యాంకర్ కశ్యప్ 21-23, 21-14, 14-21తో ప్రపంచ 59వ ర్యాంకర్ దితెర్ డోమ్కె చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో భారత్ 1-2తో వెనుకబడింది. గతంలో డోమ్కెతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన కశ్యప్ ఈసారి ఓడిపోవడం గమనార్హం. నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో భారత జోడి అక్షయ్-ప్రణవ్ చోప్రా రాణించింది. 21-9, 17-21, 21-19తో పీటర్ కెస్‌బార్-జుర్వోని జంటపై నెగ్గి స్కోరును 2-2తో సమం చేసింది.
నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో గురుసాయిదత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 62 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గురుసాయిదత్ 14-21, 21-19, 21-19తో ష్కెమిడ్‌ను ఓడించి భారత్‌కు 3-2తో విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో గురుసాయిదత్ ఒక్కడే భారత్ తరఫున సింగిల్స్ విభాగంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. గురువారం జరిగే ఉబెర్ కప్ మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ లేదా ఇండోనేసియా లేదా డెన్మార్క్ జట్టుతో భారత్ ఆడే అవకాశం ఉంది.