నాటింగ్‌హామ్: పెద్దగా అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ సమరానికి సిద్ధమైన వెస్టిండీస్ టోర్నీని ఘనంగా ఆరంభించింది. పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది. తొలుత పాకిస్తాన్‌ను కూల్చేసిన వెస్టిండీస్.. ఆపై గెలుపును సునాయాసంగా అందుకుంది. పాకిస్తాన్ నిర్దేశించిన 106 పరుగుల టార్గెట్‌ను విండీస్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్(50; 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.మరో ఓపెనర్ షాయ్ హోప్(11) నిరాశపరిచగా, డారెన్ బ్రేవో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. కాగా, గేల్ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే గేల్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత మూడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, మిగతా పనిని నికోలస్ పూరన్(34 నాటౌట్; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పూర్తి చేశాడు. పూరన్ ధాటిగా ఆడటంతో విండీస్ 13.4 ఓవర్లలో విజయాన్ని సాధించింది. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్ మూడు వికెట్లు సాధించడం మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన వెస్టిండీస్
(ఇక్కడ చదవండి: 27 ఏళ్ల తర్వాత పాకిస్తాన్..)
అంతకుముందు పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌటైంది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్(2) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. దాంతో 17 పరుగులకే పాకిస్తాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై పాక్ టాపార్డర్ ఆటగాళ్లలో ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8)లు సైతం నిరాశపరిచారు. విండీస్ బౌలర్ల నుంచి వచ్చే పదునైన బంతులకు పాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆటు తర్వాత వచ్చిన ఆటగాళ్లలో వహబ్ రియాజ్(18; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్తాన్ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది. చివరి వికెట్‌గా రియాజ్ ఔట్ కావడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 4 ఓవర్లలోనే ముగిసింది. విండీస్ బౌలర్లలో థామస్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా, జేసన్ హోల్డర్ మూడు వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. ఇక ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా, కాట్రెల్‌కు వికెట్ లభించింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment