క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు..
ఆంటిగ్వా: వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. గత రెండేళ్లుగా వెస్టిండీస్ జట్టులో చోటు కోల్పోయిన స్మిత్.. ఎట్టకేలకు క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు. 2004 జనవరిలో దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా స్మిత్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో యూఏఈతో నేపియర్ లో జరిగిన మ్యాచ్ లో స్మిత్ చివరిసారి కనిపించాడు. ఆ తరువాత వన్డే జట్టులో అతనికి స్థానం దక్కలేదు. కాగా, 2006 మార్చిలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ స్మిత్ కు ఆఖరి టెస్టు కావడం గమనార్హం.
టెస్టు కెరీర్ లో 10 మ్యాచ్ లు ఆడిన స్మిత్ 24.61 యావరేజ్ తో 320 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 105. ఇదిలా ఉండగా 105 వన్డేలు ఆడిన స్మిత్ 1560 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 97. వెస్టిండీస్ జట్టులో ట్వంటీ 20 స్పెషలిస్టుగా పేరుగాంచిన స్మిత్ 33 మ్యాచ్ ల్లో 582 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలుండగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 72. అరంగేట్రం టెస్టులో స్మిత్ చేసిన సెంచరీనే అతని తొలి, చివరి అంతర్జాతీయ సెంచరీ.