పుణె : భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ బ్యాట్స్‌మెన్ షై హోప్ (95: 113 బంతులు, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి చెలరేగాడు. అతనికి తోడుగా.. అశ్లే నర్స్ (40), హెట్‌మైర్ (37), హోల్డర్(32)లు రాణించడంతో విండీస్.. భారత్‌కు 284 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
బుమ్రా బౌలింగ్..ధోని కీపింగ్..
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో విండీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా విండీస్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్లు పోవెల్(21), హెమ్రాజ్(15)లను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే హెమ్రాజ్ ఇచ్చిన క్యాచ్ ధోని అందుకున్న విధానం ఔరా అనిపించింది. వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి మంచి ఊపు మీదు ఉన్న హెమ్రాజ్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టే యత్నం చేశాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకోవడంతో గాల్లోకి లేచింది. దీంతో ఆ బంతిని అందుకోవడానికి ధోని పరుగుత్తుకుంటూ వెళ్లి మరి, అద్భుత డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు.
ఆ వెంటనే సామ్యూల్స్‌ను ఖలీల్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి విధ్వంసకర బ్యాట్స్‌మన్ హెట్‌మెయిర్ వచ్చాడు. వచ్చి రావడంతోనే ఫోర్లు, సిక్స్‌లతో దాటిగా ఆడిన హెట్‌మైర్.. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అయితే కుల్దీప్ అద్భుత బంతికి ధోని రెప్పపాటు స్టంపౌట్‌తో హెట్‌మైర్‌ను బోల్తా కొట్టించాడు. అనంతరం విండీస్ పోవెల్(4), హోల్డర్(32), అలెన్(5)ల వికెట్లను కూడా త్వరగా కోల్పోయింది. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా గత మ్యాచ్ శతకవీరుడు షై హోప్ మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. సెంచరీకి చేరువైన క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డై శతకం చేజార్చుకున్నాడు. చివర్లో అశ్లే నర్స్(40), రోచ్(15 నాటౌట్)లు రాణించడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4, కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment