బీసీసీఐ కొత్త బాస్ ఎవరు?
న్యూఢిల్లీ:ఇప్పటివరకూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్పై సుప్రీంకోర్టు వేటు వేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త బాస్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా 70 ఏళ్ల పైబడిన వారు బోర్డులో ఉండకూడదంటూ లోధా సిఫారుసుల నేపథ్యంలో ఆ యువ బాస్ ఎవరూ అనే దానిపై చర్చ సాగుతోంది. ఆ అత్యున్నత పదవిని ఎవరు అధిరోహిస్తారనే అంశంపై క్రికెట్ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ చాలా శక్తిమంతమైన బోర్డు కాగా భారత క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించి బీసీసీఐ అధ్యక్ష పదవి చాలా కీలకం. ఐసీసీ సంబంధాలతో సహా ఐపీఎల్ నిర్వహణ, జాతీయ సెలెక్షన్ కమిటీ, జట్టు ఎంపిక తదితర వ్యవహారాల్లో బీసీసీఐ చీఫ్ పాత్ర కీలకం. భారత క్రికెట్లో ఐదు జోన్లు ఉన్నాయి. రొటేషన్ పద్దతి ప్రకారం మూడేళ్లకోసారి ఒక్కో జోన్ నుంచి బీసీసీఐ చీఫ్ను ఎన్నుకుంటారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈస్ట్జోన్ కు చెందిన అనురాగ్ తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఈస్ట్జోన్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాక్ మనోహర్ రాజీనామా తరువాత అనురాగ్ ఆ పదవిని అలంకరించారు. ఆ జోన్లో ఉన్న ఆరు క్రికెట్ అసోసియేషన్లు అనురాగ్కు మద్దతివ్వడంతో అనురాగ్ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఈస్ట్ జోన్ నుంచి సరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సౌరవ్ గంగూలీగానే కనబబడతోంది.
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. బీసీసీఐ బాస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో గంగూలీనే ముందు వరసలో ఉన్నాడు. టీఎస్ మాథ్యూ, గౌతమ్ రాయ్లు ఉన్నా వారు వెస్ట్ జోన్ కు చెందిన వారు కావడంతో గంగూలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బోర్డు అధ్యక్షుడి కొత్త నియమకానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుత చర్చపై గంగూలీ ఎలా స్పందిస్తాడో చూడాలి.