ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్ ఆదివారం(మే 27)తో ముగియనుంది. రేపటి టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించగా, క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి సన్‌రైజర్స్ తుది బెర్తును ఖాయం చేసుకుంది. అయితే ఈ రెండు జట్లను ఒక సెంటిమెంట్ బలంగా ఊరిస్తోంది.
లీగ్ దశలో పాయింట్ల పట్టికలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చివరి స్థానంలో నిలిచిన ప్రతిసారీ రెండో స్థానంలో ఉన్న జట్టే విజేతగా నిలిచింది. 2011లో చెన్నై, 2013లో ముంబయి, 2014లో కోల్‌కతా జట్లు విజేతగా అవతరించాయి. ప్రస్తుత సీజన్‌లో లీగ్ దశ ముగిసే సరికి సీఎస్‌కే రెండో స్థానంలో నిలిచింది. దీని ప్రకారం ధోని సేన విజేతగా నిలవాలి.
అదే సమయంలో సన్‌రైజర్స్ కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. గత సీజన్ సెంటిమెంట్ పునరావృతమైతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌నే ఐపీఎల్ ట్రోఫీ వరించాలి. 2017 సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న తొలి రెండు జట్లే ఫైనల్‌కు చేరాయి. అంతేకాకుండా టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టుకే టైటిల్ దక్కింది. ఆ సీజన్‌లో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉన్న అప్పటి జట్టు రైజింగ్ పుణెతో క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఓటమిపాలైంది. క్వాలిఫైయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్లో పుణెతో తలపడి ఉత్కంఠ పోరులో ముంబై టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఈ సీజన్‌లో టాప్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం రెండో స్థానంలో ఉన్న ధోని సారథ్యంలోని చెన్నైసూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. మళ్లీ క్వాలిఫయర్-2 మ్యాచ్ కూడా అప్పటిలా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీని ప్రకారం చూస్తే సన్‌రైజర్స్ కప్‌ను గెలవాలి. మరి ఈ సెంటిమెంట్ ఫైట్‌లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment