వెంటనే అమలు చేస్తాం
ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా సూచించిన ప్రతిపాదనల అమల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ఏకంగా బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను తొలగించడంతో ఇతర క్రికెట్ సంఘాల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. వీటిని తమ ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వెంటనే అమలు చేస్తుందని బీసీసీఐ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. ‘సుప్రీం కోర్టు తీర్పుపై మాకు ఎలాంటి అయోమయం లేదు. మేం వెంటనే లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేయబోతున్నట్టు ఏసీఏ కార్యదర్శి హోదాలో ప్రకటిస్తున్నాను. భారత క్రికెట్ ముందుకెళ్లడమే మా ధ్యేయం.
ఇప్పటిదాకా మేమంతా కలిసి ఉన్నాం కాబట్టి అమలు చేయలేదు. ఇప్పుడు తీర్పు వచ్చాక తిరస్కరించే సమస్యే లేదు’ అని గోకరాజు తెలిపారు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించే అవకాశాలపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయంలో తనకు మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఢిల్లీ క్రికెట్ సంఘం నుంచి సీకే ఖన్నా తనకన్నా సీనియర్ అని గుర్తుచేశారు. ఒకవేళ అవకాశం దక్కితే గౌరవంగా భావిస్తానని అన్నారు.