ముర్రే మెరిసేనా!
లండన్: గత పదేళ్లలో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ నలుగురు క్రీడాకారుల (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) ఖాతాలోకి వెళ్లింది. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో ఈసారీ ఆ నలుగురే టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు. గతేడాది 77 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తొలి బ్రిటన్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన ఆండీ ముర్రేపై అందరికంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ మహిళా క్రీడాకారిణి అమెలీ మౌరెస్మోను కోచ్‌గా నియమించుకున్నాక ముర్రే ఆడుతోన్న తొలి ప్రధాన టోర్నీ ఇదే కావడం విశేషం. నిరుడు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తర్వాత ముర్రే ఇప్పటిదాకా మరే టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. తొలి రౌండ్‌లో బెల్జియం రైజింగ్ స్టార్ డేవిడ్ గాఫిన్‌తో తలపడనున్న ముర్రేకు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశాలు కనిపించడంలేదు.
మరోవైపు ఇటీవల రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌కు రెండేళ్లుగా వింబుల్డన్ టోర్నీ కలసిరావడం లేదు. 2012లో రెండో రౌండ్‌లో ఓడిన ఈ స్పెయిన్ స్టార్... గతేడాది తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. తొలి రౌండ్‌లో మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా)తో పోటీపడనున్న నాదల్ ఈసారి ఏం చేస్తాడో వేచి చూడాలి.
వింబుల్డన్ టోర్నీని రికార్డు స్థాయిలో ఏడుసార్లు గెల్చుకున్న రోజర్ ఫెడరర్ ఖాతాలో 2012 నుంచి మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరలేదు. యువ ఆటగాళ్ల జోరులో వెనుకబడిపోయిన ఈ స్విస్ దిగ్గజానికి ఈ టోర్నీ పరీక్షగా నిలువనుంది.
గత నాలుగేళ్లుగా ఈ టోర్నీలో కనీసం సెమీఫైనల్‌కు చేరుకుంటున్న టాప్ సీడ్ జొకోవిచ్ 2011 తర్వాత మరోసారి చాంపియన్‌గా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. గతేడాది ఫైనల్లో ముర్రే చేతిలో ఓడిన ఈ సెర్బియా స్టార్‌కు కాస్త అనుకూలమైన ‘డ్రా’నే పడింది.
మహిళల విభాగానికొస్తే కచ్చితమైన ఫేవరెట్స్ ఎవరూ కనిపించడంలేదు. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), రెండో సీడ్ నా లీ (చైనా), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్), ఐదో సీడ్ షరపోవా (రష్యా), నిరుటి రన్నరప్ సబైన్ లిసికి (జర్మనీ), ఎనిమిదో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు.
ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 17 లక్షల 60 వేల పౌండ్ల (రూ. 18 కోట్లు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.
నేటి ముఖ్య మ్యాచ్‌లు
పురుషుల విభాగం
ఆండీ ముర్రే (3) x డేవిడ్ గాఫిన్
నొవాక్ జొకోవిచ్ (1) x గొలుబేవ్
థామస్ బెర్డిచ్ (6) x విక్టర్ హనెస్కూ
మహిళల విభాగం
నా లీ (2) x పౌలా కానియా
అగ్నెస్కా రద్వాన్‌స్కా (4) xఆండ్రియా మితు
పెట్రా క్విటోవా (6) x హలవకోవా
నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్