
టీమిండియాకు సెహ్వాగ్ శుభాకాంక్షలు
గుర్గావ్: వచ్చే నెలలో ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు తమ టైటిల్ నిలబెట్టుకోవాలంటూ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘డిఫెండింగ్ చాంపియన్‌గా మన జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ టోర్నీలోనూ బాగా ఆడి టైటిల్ నిలబెట్టుకుని తద్వారా వంద కోట్లకు పైగా భారతీయులకు అమితానందం కలిగించాలి’ అని స్థానికంగా జరిగిన ప్రపంచకప్ ట్రోఫీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ అన్నాడు.
బౌలింగ్ గురించే ఆందోళన: అజహర్
చండీగఢ్: ప్రపంచకప్ కోసం బరిలోకి దిగబోతున్న భారత క్రికెట్ జట్టు సమతూకంతోనే ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగం గురించే ఆందోళనగా ఉందని మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ‘15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టు బాగానే ఉంది. అయితే బౌలింగ్ విభాగం ఏమేరకు రాణిస్తుందనేది ఆసక్తికరం. ముక్కోణపు సిరీస్ కూడా ముగిశాక ఏమేరకు ప్రత్యర్థులకు సవాల్ విసరగలరో తెలిసిపోతుంది’ అని చండీగఢ్‌లో తన క్రికెట్ అకాడమీని ప్రారంభించిన 51 ఏళ్ల అజహర్ సూచించారు. జట్టు ఎంపికలో సీనియర్ ఆటగాళ్ల పట్ల సెలక్టర్లు కఠినంగా వ్యవహరించారని అన్నారు.