నవ కెరటం!
► మహిళల క్రికెట్‌లో దూసుకెళుతున్న స్మృతి మంధన
► దూకుడైన ఆటతో అదరగొడుతున్న వైనం
స్మృతి మంధన కిట్ బ్యాగ్‌లో దాదాపు భారీ సైజ్ బ్యాట్ ఒకటి ఉంటుంది. ప్రాక్టీస్ సమయంలో ఆమె దాన్ని కూడా తప్పనిసరిగా తీసుకొస్తుంది కానీ దాంతో బ్యాటింగ్ మాత్రం చేయదు. అది రాహుల్ ద్రవిడ్ సంతకం చేసి ఆమె అన్నకు బహుమతిగా ఇచ్చిన బ్యాట్. స్మృతి క్రికెట్ మొదలు పెట్టినప్పుడు ద్రవిడ్ అంత గొప్ప ప్లేయర్ కావాలని దీవిస్తూ సోదరుడు ఇచ్చిన ఆ బ్యాట్ ఆమెకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూ ఉంటుంది.
ఒకప్పుడు స్మృతి, మ్యాథ్యూ హేడెన్‌లా ఆడేందుకు ప్రయత్నించింది. అలాంటి ఆటతీరు నీకు నప్పదంటూ కోచ్ చెప్పడంతో బలంకంటే టైమింగ్‌నే నమ్ముకుంటూ కుమార సంగక్కర శైలిని అనుకరించింది. ఆసీస్ గడ్డపై టి20 సిరీస్ గెలిచినప్పుడు స్వయంగా ప్రశంసించిన హేడెన్, సొంత శైలిని అలవర్చుకోమని చెప్పడం ఆమె ఆటను మార్చింది. బ్యాటింగ్‌లో యువరాజ్‌ను అభిమానించినా... తనదైన ప్రత్యేకత కోసం శ్రమిస్తున్న స్మృతి మంధన ఇప్పుడు భారత మహిళల క్రికెట్‌లో కొత్త కెరటం.
సాక్షి క్రీడా విభాగం
‘పురుషుల క్రికెట్‌లో ఇప్పుడు 18వ నంబర్ జెర్సీకి చాలా ప్రత్యేకత ఉంది. చూస్తూ ఉండండి కొద్ది రోజుల్లోనే మహిళల 18వ నంబర్ కూడా సంచలనానికి కేంద్రంగా మారుతుంది’... ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ జరిగినప్పుడు విరాట్ కోహ్లితో పోలుస్తూ కామెంటేటర్లు చేసిన వ్యాఖ్య స్మృతికి లభిస్తున్న గుర్తింపునకు అద్దం పడుతుంది. దాదాపు ఐదు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని బిగ్‌బాష్ లీగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ స్మృతి మోకాలికి తీవ్ర గాయమైంది.
దాంతో ఆమె వరల్డ్ కప్ క్వాలిఫయర్, దక్షిణాఫ్రికాలో నాలుగు దేశాల టోర్నీకి దూరమైంది. ఈ గాయం కెరీర్‌ను ముగిస్తుందేమోనని కూడా ఆమె భయపడింది. అయితే దీనినుంచి కోలుకొని మళ్లీ బరిలోకి దిగేందుకు మంధన తీవ్రంగా కష్టపడింది. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహ్యాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఆటతో పాటు ఫిట్‌నెస్ కోసం కూడా అదనంగా శ్రమించింది. స్వయంగా కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఆమె కోలుకోవడంపై సందేహాలు వ్యక్తం చేసినా... పట్టుదలగా తిరిగొచ్చిన స్మృతి ప్రపంచ కప్‌కు తన ఎంపిక సరైందేనని నిరూపించింది.
నాన్న, అన్న అండగా..:
మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణం స్మృతి స్వస్థలం. స్మృతి సోదరుడు శ్రవణ్ మహారాష్ట్ర తరఫున అండర్–19 స్థాయి వరకు ఆడాడు. వర్ధమాన ఆటగాడిగా రాణిస్తున్న సమయంలో అతని పేరు, స్కోర్లు పదే పదే స్థానిక పత్రికల్లో రావడం ఆమెను ఆకర్షించింది. దాంతో తాను కూడా క్రికెట్ ఆడతానన్న ఆమె కోరికను తండ్రి శ్రీనివాస్ కాదనలేదు. అయితే సాధారణంగా కుడి చేతి వాటమే అయినా... తండ్రికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌పై మక్కువ ఉండటంతో అలా ఆమె ఎడమచేతి వాటంగా మారింది.
స్థానిక కోచ్ అనంత్ వద్ద ఆటను మెరుగుపర్చుకున్న స్మృతి 9 ఏళ్ల వయసులో మహారాష్ట్ర అండర్–15 జట్టులో, 11 ఏళ్ల వయసులో అండర్–19 జట్టులోకి ఎంపిక కావడం విశేషం. సైన్స్ చదవడం తనకు ఇష్టమని చెప్పినా... ఆటపైనే దృష్టి పెట్టమంటూ తల్లి స్మిత ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె దూసుకుపోయింది. దేశవాళీ అండర్–19 వన్డేల్లో గుజరాత్‌పై 224 నాటౌట్‌తో పాటు మరో మూడు సెంచరీలు చేయడం స్మృతి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అనంతరం చాలెంజర్ టోర్నీకి, ఆపై భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి.
మెరుపు బ్యాటింగ్..:
16 ఏళ్ల వయసులో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో స్మృతి తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తర్వాతి సంవత్సరం వార్మ్‌స్లీలో ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్టు విజయం సాధించిన భారత జట్టులో స్మృతి సభ్యురాలు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఎనిమిది మందిలో ఈమె కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించి గెలుపులో కీలక పాత్ర కూడా పోషించింది. ఏడాదిన్నర క్రితం హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 109 బంతుల్లో 102 పరుగులు సాధించిన మ్యాచ్ ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ క్షణం.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లపై చెలరేగిన తీరు ఆమెకు ఉమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో అవకాశాన్ని కల్పించింది. ‘స్మృతిలో నేను గమనించిన లక్షణం ఆమె దూకుడు. ఒక్కసారి తాను గట్టిగా నిర్ణయించుకుంటే ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉంటుంది. అది ఎలాంటిదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా వంద శాతం శ్రమిస్తూ ఏటికి ఎదురీది వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. లేదంటే హోబర్ట్‌లాంటి ఇన్నింగ్స్ అందరికీ సాధ్యం కాదు’ అని ఆమెపై భారత జట్టు మాజీ కోచ్ పూర్ణిమా రావు ప్రశంసలు కురిపించారు. రెండు ఇన్నింగ్స్‌లతోనే ఆగిపోను, ప్రపంచకప్ గెలవడమే లక్ష్యం అంటున్న స్మృతి మంధన మున్ముందు బ్యాట్స్‌మన్‌గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
అది మాత్రమే మారింది...
ఈ నెల 18తో 21 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న స్మృతి, సాంగ్లిలోనే కామర్స్‌లో రెండో ఏడాది డిగ్రీ చదువుతోంది. ప్రపంచ కప్‌కు ముందు వరకు ఆమె కంటి సమస్యతో బాధ పడింది. ఫలితంగా కెరీర్ ఆరంభం నుంచి కళ్లద్దాలు ధరించే ఆమె బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అది ఆటకు అడ్డుగా మారకున్నా... దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని స్మృతి భావించింది. మోకాలి గాయంతో కోలుకుంటున్న సమయంలోనే కంటికి శస్త్రచికిత్స చేయించుకొని ఇప్పుడు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. ‘వేటాడే పులి తరహాలో బ్యాటింగ్ సమయంలో ఆమె కళ్లలో అప్పుడూ, ఇప్పుడూ కూడా అదే తీవ్రత, ఏకాగ్రత ఉంది. కళ్ల జోడు లేకపోవడం ఒక్కటే మార్పు. మిగతాదంతా సేమ్ టు సేమ్’ అని ఆమె సహచరులు స్మృతి గురించి ఇప్పుడు చెబుతున్నారు.