చైనా గోడను దాటితేనే...
- సైనా, సింధులకు పతకావకాశాలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘డ్రా’ విడుదల
జకార్తా (ఇండోనేసియా): అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని సాధించాలన్నా... వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్ లో పతకం నెగ్గాలన్నా... భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. వచ్చే నెల ఆగస్టు 10 నుంచి 16 వరకు జకార్తాలో జరిగే ఈ ప్రతిష్టాత్మక పోటీలకు సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. సైనా నెహ్వాల్ రెండో సీడ్‌గా, సింధు 11వ సీడ్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సైనా రెండో రౌండ్‌లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్) లేదా కాటీ టాల్మోఫ్ (ఎస్తోనియా)లతో ఆడుతుంది.
ఈ మ్యాచ్‌లో నెగ్గితే మూడో రౌండ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయికి 14వ సీడ్ సయాకా తకహాషి (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. ఈ రౌం డ్‌ను అధిగమిస్తే సైనాకు క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) ఉండవచ్చు. క్వార్టర్స్‌లో గెలిస్తే సైనాకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. మరోవైపు సింధుకు కూడా తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. రెండో రౌండ్‌లో లిన్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) లేదా చోలీ మాగీ (ఐర్లాండ్)తో ఆడనున్న సింధుకు మూడో రౌండ్‌లో మూడో సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ లీ జురుయ్ (చైనా) ఎదురయ్యే అవకాశముంది.
గత రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు ఈసారీ పతకం నెగ్గాలంటే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ లీ జురుయ్‌పై నెగ్గితే సింధు క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా) లేదా తొమ్మిదో సీడ్ నోజోమి ఒకుహారా (జపాన్)తో తలపడుతుంది. క్వార్టర్స్ దశను దాటితే సింధుకు కాంస్యం ఖాయమవుతుంది. మొత్తానికి సైనా, సింధు పతకావకాశాలు చైనా క్రీడాకారిణులతో జరిగే మ్యాచ్ ఫలితాలపైనే ఆధారపడి ఉన్నాయి.
ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి మూడో సీడ్ శ్రీకాంత్, పదో సీడ్ కశ్యప్, 11వ సీడ్ ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తొలి రౌండ్‌లో ఫారిమన్ (ఆస్ట్రేలియా)తో శ్రీకాంత్; ఎరిక్ మాజిస్ (నెదర్లాండ్స్) తో కశ్యప్; అలెక్స్ (బ్రెజిల్)తో ప్రణయ్ ఆడతారు. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్; మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప; సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె; ధాన్యా నాయర్-మొహితా సహదేవ్; మిక్స్‌డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్; సిక్కి రెడ్డి-కోనా తరుణ్ జంటలు బరిలో ఉన్నాయి. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో భారత్ నుంచి తొలిసారి 18 మంది పాల్గొంటున్నారు.