మేం ప్రపంచకప్ గెలిస్తే...
ముంబై: ఇంగ్లండ్‌లో ఈనెల 24న మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌ను తాము గెలిస్తే భారత మహిళల క్రికెట్‌లో పెను మార్పులు సంభవించడం ఖాయమని కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. ఇటీవలికాలంలో తమ జట్టు రాణిస్తున్న తీరు చాలా బాగుందని తెలిపింది. ‘మేం ఈ ప్రపంచకప్‌ను గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అదే జరిగితే భారత మహిళ క్రికెట్‌కు అది విప్లవాత్మకమైన ముందడుగు అవుతుంది. మా విజయాన్ని ప్రేరణగా తీసుకుని ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ముందుకు వస్తారు. అది మహిళల క్రికెట్ అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని మిథాలీ పేర్కొంది.
ఈ మెగా టోర్నీలో పాల్గొనేందు కు జట్టు శనివారం రాత్రి బయలుదేరింది. మరోవైపు మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా పేరు తెచ్చుకునేందుకు మిథాలీ మరో 212 పరుగుల దూరంలో ఉంది. ప్రపంచకప్‌లో ముందుగా సెమీఫైనల్ బెర్త్‌పై దృష్టి పెడతామని తెలిపింది. గత రెండు సిరీస్‌ల్లో జట్టులోని ముగ్గురు పేసర్లు అద్భుతంగా రాణించారని, అయితే వారంతా గాయాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం ముఖ్యమని ఈ హైదరాబాదీ క్రికెటర్ చెప్పింది. ‘నిజానికి ప్రతీ జట్టు కూడా ఓ అదనపు పేసర్ ఉండాలని కోరుకుంటుంది. కానీ భారత్ ఎక్కువగా స్పిన్నర్లను కలిగి ఉంటుంది. అయితే ఆసీస్, దక్షిణాఫ్రికా ఇలా ఎక్కడైనా వారు మెరుగ్గా రాణించగలిగారు’ అని గుర్తుచేసింది. గత నెలలో జరిగిన నాలుగు దేశాల సిరీస్‌లో అద్భుతంగా ఆడిన భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
సీనియర్లపై ఒత్తిడి ఉంది...
జట్టుకు విజయాలందించడంపై తనతోపాటు జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, శిఖా పాండే, వేద కృష్ణమూర్తిలపై ఒత్తిడి అధికంగానే ఉంటుందని మిథాలీ తెలిపింది. ‘ప్రపంచకప్‌లాంటి టోర్నీల్లో ఆడుతున్నప్పుడు మాపై ఉన్న అంచనాల గురించి తెలుసు. అయితే తొలిసారిగా ఆడుతున్న యువ క్రికెటర్లను ముందు మేం ఉత్సాహపరచాల్సి ఉంటుంది. ఇక టోర్నీలో మా బ్యాటింగ్ ఆర్డర్ కూర్పును ఎలా మార్చుకుంటామనేది పరిశీలిస్తాం. అయితే ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్టుగా మా సన్నాహకాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చెప్పలేను. మంచి వెలుతురు ఉన్న స్థితిలో ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో 300కు పైగా పరుగులు వస్తున్నాయి. మా జట్టు కూడా అదే రీతిలో ఆడాలని ఆశిస్తున్నాను’ అని 34 ఏళ్ల మిథాలీ తెలిపింది.