స్మృతి శతకం... సిరీస్‌ సొంతం | India Women beat New Zealand Women by 6 wickets | Sakshi
Sakshi News home page

స్మృతి శతకం... సిరీస్‌ సొంతం

Published Wed, Oct 30 2024 3:09 AM | Last Updated on Wed, Oct 30 2024 3:09 AM

India Women beat New Zealand Women by 6 wickets

చివరి వన్డేలో భారత మహిళల గెలుపు

6 వికెట్లతో ఓడిన న్యూజిలాండ్‌ 

2–1తో సిరీస్‌ హర్మన్‌ బృందం కైవసం

అహ్మదాబాద్‌: వారెవా... స్మృతి మంధాన ఇలా ఆడి ఎన్నాళ్లైంది. ఆఖరి వన్డే చూసినవారందరి నోటా వినిపించిన మాట ఇదే! కీలకమైన పోరులో ఆమె సాధించిన శతకంతో భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను 2–1తో వశం చేసుకుంది. ఈ విజయంలో బౌలర్లు దీప్తిశర్మ, ప్రియా మిశ్రాలతో పాటు కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా తోడయ్యారు. దీంతో మూడో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. 

టాస్‌ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. బ్రూక్‌ హాలిడే (96 బంతుల్లో 86; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆదుకుంది. ఓపెనర్‌ జార్జియా ప్లిమెర్‌ (67 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. భారత బౌలర్లలో దీప్తిశర్మ 3 వికెట్లు పడగొట్టగా, యువ లెగ్‌స్పిన్నర్‌ ప్రియా మిశ్రా (2/41) కీలకమైన వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 44.2  ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి గెలిచింది. 

చాన్నాళ్ల తర్వాత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (122 బంతుల్లో 100; 10 ఫోర్లు)బ్యాట్‌కు పనిచెప్పింది. హర్మన్‌ప్రీత్‌ (63 బంతుల్లో 59 నాటౌట్‌; 6 ఫోర్లు) రాణించింది. హన్నా రోవ్‌ 2 వికెట్లు పడగొట్టింది. కివీస్, భారత్‌ తమ తుది జట్లలో ఒక్కోమార్పు చేశాయి. జెస్‌ కెర్‌ స్థానంలో హన్నా రోవ్‌ బరిలోకి దిగింది. భారత జట్టులో హైదరాబాద్‌ సీమర్‌ అరుంధతి రెడ్డి స్థానంలో రేణుకా సింగ్‌ను తీసుకున్నారు.  

హాలిడే ఒంటరి పోరాటం 
భారత బౌలర్లు, ఫీల్డర్లు కట్టుదిట్టం చేయడంతో కివీస్‌కు ఆరంభంలోనే కష్టాలెదురయ్యాయి. జెమీమా మెరుపు ఫీల్డింగ్‌తో సుజీ బేట్స్‌ (4)తో పాటు మ్యాడీ గ్రీన్‌ (15)ను రనౌట్‌ చేసింది. సైమా, ప్రియా బౌలింగ్‌లలో లౌరెన్‌ (1), సోఫీ డివైన్‌ (9)లు అవుటయ్యారు. దీంతో ఒక దశలో 88/5 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్‌ను మిడిలార్డర్‌ బ్యాటర్‌ బ్రూక్‌ హాలిడే ఆదుకుంది. చూడచక్కని బౌండరీలు, మూడు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఇసాబెల్లా గేజ్‌ (49 బంతుల్లో 25; 1 ఫోర్‌)తో ఆరో వికెట్‌కు 64 పరుగులు, తహుహు (14 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించాక హాలిడే నిష్క్రమించింది. 

గెలిపించిన స్మృతి, హర్మన్‌ 
చూసేందుకు లక్ష్యం సులువుగానే కనిపిస్తుంది. అయితే గత మ్యాచ్‌ గుర్తుకొస్తే ఎక్కడ, ఎప్పుడు కూలిపోతోందోనన్న బెంగ! నాలుగో ఓవర్లోనే షఫాలీ (12) అవుట్‌. స్మృతి ఫామ్‌పై దిగులు! కానీ స్టార్‌ ఓపెనర్‌ కీలకమైన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ యస్తిక భాటియా (49 బంతుల్లో 35; 4 ఫోర్లు)తో కలిసి జట్టును పరుగుల బాట పట్టించింది. జట్టు స్కోరు వందకు చేరువయ్యే సమయంలో 92 పరుగుల వద్ద యస్తికను సోఫీ రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చింది. క్రీజులోకి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ రాగా... 73 బంతుల్లో స్మృతి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది.

ఇద్దరు కలిసి న్యూజిలాండ్‌ బౌలర్లపై కదం తొక్కడంతో జట్టు గెలుపుబాట పట్టింది. హర్మన్‌ 54 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించింది. కాసేపటికే మంధాన 121 బంతుల్లో సెంచరీ మైలురాయిని చేరుకుంది. అదే స్కోరు వద్ద ఆమె క్లీన్‌బౌల్డయ్యింది. అప్పటికే జట్టు గెలుపుతీరానికి చేరుకుంది. జెమీమా (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)తో హర్మన్‌ లాంఛనాన్ని దాదాపు పూర్తి చేస్తుండగా, విజయానికి పరుగుదూరంలో జెమీమా ఎల్బీగా వెనుదిరిగింది. తేజల్‌ (0 నాటౌట్‌) ఖాతా తెరువకముందే హర్మన్‌ప్రీత్‌ బౌండరీతో జట్టును గెలిపించింది. 

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ మహిళల ఇన్నింగ్స్‌: సుజీ బేట్స్‌ రనౌట్‌ 4; జార్జియా (సి) దీప్తి (బి) ప్రియా 39; లౌరెన్‌ (సి) యస్తిక (బి) సైమా 1; సోఫీ డివైన్‌ (బి) ప్రియా 9; హాలిడే (సి) రాధ (బి) దీప్తి 86; మ్యాడీ గ్రీన్‌ రనౌట్‌ 15; ఇసాబెల్లా (సి) అండ్‌ (బి) దీప్తి 25; హన్నా రోవ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 11; తహుహు నాటౌట్‌ 24; కార్సన్‌ (సి) రాధ (బి) రేణుక 2; జొనాస్‌ రనౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 232. వికెట్ల పతనం: 1–24, 2–25, 3–36, 4–66, 5–88, 6–152, 7–199, 8–210, 9–219, 10–232. బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 10–1–49–1, సైమా ఠాకూర్‌ 9.5–1–44–1, ప్రియా మిశ్రా 10–1–41–2, దీప్తిశర్మ 10–2–39–3, రాధా యాదవ్‌ 4–0–21–0, హర్మన్‌ప్రీత్‌ 6–0–34–0.  

భారత మహిళల ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (బి) రోవ్‌ 100; షఫాలీ (సి) ఇసాబెల్లా (బి) రోవ్‌ 12; యస్తిక (సి) అండ్‌ (బి) సోఫీ 35; హర్మన్‌ప్రీత్‌ నాటౌట్‌ 70; జెమీమా (ఎల్బీడబ్ల్యూ) (బి) జొనాస్‌ 11; తేజల్‌ నాటౌట్‌ 0;  ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 236. వికెట్ల పతనం: 1–16, 2–92, 3–209, 4–232. బౌలింగ్‌: లియా తహుహు 6–0–30–0,  హన్నా రోవ్‌ 8–0–47–2, ఎడెన్‌ కార్సన్‌ 10–0–45–0, సోఫీ డివైన్‌ 7.2–0–44–1, సుజీ బేట్స్‌ 4–0–18–0, 
ఫ్రాన్‌ జొనాస్‌ 9–1–50–1.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement