ప్రపంచ షూటింగ్ పోటీలకు కైనన్
10 మీ.ఎయిర్ రైఫిల్ జట్టులో గగన్ నారంగ్‌కు దక్కని చోటు
న్యూఢిల్లీ: రియో డి జనీరో-2016 ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్ అయిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ ట్రాప్ షూటర్ కైనన్ చెనాయ్‌కు చోటు లభించింది. స్పెయిన్‌లోని గ్రెనడా నగరంలో ఈ ఏడాది సెప్టెంబరు 8 నుంచి 19 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. పురుషుల ‘ట్రాప్’ ఈవెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్‌లతో కలిసి 23 ఏళ్ల కైనన్ బరిలోకి దిగుతాడు.
2008 పుణే కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన కైనన్... గతేడాది జరిగిన సింగపూర్ ఓపెన్‌లోనూ పసిడి పతకాన్ని సాధించాడు. హైదరాబాద్‌కే చెందిన మరో స్టార్ షూటర్ గగన్ నారంగ్‌కు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టులో స్థానం లభించలేదు. అయితే గగన్ నారంగ్ మిగతా రెండు ఈవెంట్స్ రైఫిల్ త్రీ పొజిషన్, రైఫిల్ ప్రోన్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. లండన్ ఒలింపిక్స్‌లో గగన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా తొలి విడతగా 64 మంది షూటర్లు 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.