‘వృద్ధి’మాన్‌భవ... | Wriddhiman Saha ascend in ICC Test rankings | Sakshi
Sakshi News home page

‘వృద్ధి’మాన్‌భవ...

Published Tue, Oct 4 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

‘వృద్ధి’మాన్‌భవ...

‘వృద్ధి’మాన్‌భవ...

అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం
 జట్టులో స్థానం సుస్థిరం


 ఆరేళ్ల క్రితం తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడిన భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా... ఇప్పటివరకూ ఆడిన టెస్టుల సంఖ్య కేవలం 17. ధోని టెస్టు క్రికెట్ నుంచి ఆకస్మికంగా 2014 డిసెంబరులో వైదొలిగే సమయానికి సాహా అనుభవం కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లే. 2010లో మూడు వన్డేలు, 2014లో ఆరు వన్డేలు ఆడాడు. కారణం... మహేంద్ర సింగ్ ధోని. భారత వన్డే కెప్టెన్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడటంతో అవకాశాలు లేక ఎదురుచూసిన ఎంతోమంది వికెట్ కీపర్లలో ఒకడు సాహా. నిజానికి ధోనికి గాయమైతే తమకు అవకాశం దొరుకుతుందని ఎంతోమంది ఆశగా ఎదురుచూసిన రోజులవి. అవకాశాలు రాకపోచినా... సాహా నిరాశపడలేదు. తనకు ఏదో ఒక ‘మంచి’రోజు వస్తుందని ఆశగా ఎదురుచూశాడు. ఇంతకాలానికి 32 ఏళ్ల వయసులో అతనికి తగిన గుర్తింపు, గౌరవం లభించాయి.  
 
 సాక్షి క్రీడావిభాగం
 సహనం... ఈ పదానికి పర్యాయపదం సాహా. జట్టులో పాతుకుపోయిన ధోని ఓ వైపు... ఒకవేళ ధోని విశ్రాంతి తీసుకున్నా దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్‌లాంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న వికెట్ కీపర్లతో పోటీ మరోవైపు. నిజానికి గత ఎనిమిదేళ్లలో భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ల బాధ మాటల్లో చెప్పడం కష్టం. ఎంత మంచి ఇన్నింగ్‌‌స ఆడినా అవకాశం దొరికేది కాదు. కీపింగ్‌లో ఎంత నైపుణ్యం ఉన్నా ఫలితం దక్కేది లేదు. నిజానికి దీనికి ఎవరినీ తప్పు పట్టడానికి కూడా లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి. అయినా సాహా ఓపికగా రంజీ మ్యాచ్‌లు ఆడుతూనే కాలం గడిపాడు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడాడు. అవకాశం వస్తుందో రాదో తెలియదు, భారత జట్టుకు ఆడతాడో లేదో అనే సందేహం... అయినా ఓపికగా ఎదురు చూశాడు.
 
 కీపర్‌గా ఉత్తమం
 ఓ పెద్ద క్రికెటర్ స్థానంలో మరో ఆటగాడు జట్టులోకి వస్తే కచ్చితంగా ఇద్దరినీ పోల్చి చూస్తారు. ధోని టెస్టుల నుంచి రిటైర్ కావడానికి ముందు లభించిన అరకొర అవకాశాలను సాహా అందిపుచ్చుకోలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్‌‌సల్లో కలిపి 74 పరుగులు చేశాడు. నిజానికి ఓ కొత్త క్రికెటర్‌కు ఇది చెత్త ప్రదర్శనేం కాదు. కానీ ధోనితో పోలిక వల్ల ఈ 74 పరుగులు కనిపించలేదు. అయితే కీపర్‌గా మాత్రం సాహా అందరినీ ఆకట్టుకున్నాడు.
 
 ధోని కంటే ఎక్కువ వేగంతో వికెట్ల వెనక కదిలాడు. 2014లో కెప్టెన్ ధోని టెస్టుల నుంచి తప్పుకోవడంతో అవకాశం వచ్చినా... ఆస్ట్రేలియాలో ఆడిన రెండు టెస్టుల్లో ఓ మాదిరిగానే ఆడాడు. అయితే కీపర్‌గా మాత్రం వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు. నిజానికి ఉపఖండం బయట కంటే స్వదేశంలో కీపింగ్ చేయడం చాలా కష్టం. స్పిన్నర్లు వేసే బంతులు ఎప్పుడు ఎలా టర్న్, బౌన్‌‌స అవుతాయో తెలియదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. బ్యాట్స్‌మన్‌గా అంతంత మాత్రంగానే ఆడినా వికెట్ కీపింగ్‌లో పేరు తెచ్చుకోవడంతో సాహా జట్టులో కొనసాగాడు.
 
 మలుపు తిప్పిన విండీస్ పర్యటన
 తాజాగా వెస్టిండీస్‌లో భారత పర్యటనలో సాహా పరిస్థితి చాలా భిన్నం. నిజానికి అశ్విన్ బౌలర్, సాహా బ్యాట్స్‌మన్. కానీ బ్యాటింగ్ ఆర్డర్‌లో అశ్విన్ ముందుగా వచ్చేవాడు. కెప్టెన్, కోచ్‌లకు అశ్విన్‌పై ఉన్న నమ్మకం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. కానీ ఇదే సమయంలో సాహా పరిస్థితినీ అర్థం చేసుకోవాలి. అరుుతే ఏమాత్రం నిరాశ చెందని సాహా వెస్టిండీస్ పర్యటనలో చాలా బాగా ఆడాడు. అశ్విన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు.
 
 వరుసగా రెండు టెస్టుల్లో 40, 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే సాహా కెరీర్‌ను మలుపు తిప్పిన ఇన్నింగ్‌‌స మూడో టెస్టు (గ్రాస్ ఐలట్)లో వచ్చింది. సాహా క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ 126 పరుగులకు ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అశ్విన్‌తో కలిసి ఓపికగా ఇన్నింగ్‌‌సను నిర్మించాడు. అశ్విన్ కంటే మెరుగైన స్టయిక్ రేట్ (45.81)తో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ పేసర్లు కొత్త బంతితో విసిరిన సవాళ్లను అలవోకగా అధిగమించాడు. ఈ సెంచరీతో భారత టెస్టు జట్టులో ఒక రకంగా అతను పాతుకుపోయాడు.
 
 ఈడెన్‌లో ‘వండర్’
 న్యూజిలాండ్‌తో కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్‌‌సలో సాహా డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్‌‌సలో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక కోల్‌కతాలో తన సొంతగడ్డపై మాత్రం సాహా వరుసగా రెండు ఇన్నింగ్‌‌సలోనూ అద్భుతం చేశాడు. బ్యాటింగ్ చేయడం చాలా క్లిష్టంగా ఉన్న పిచ్‌పై టెయిలెండర్ల సహాయంతో ఇన్నింగ్‌‌సను నిలబెట్టాడు. చివరి నాలుగు వికెట్లకు బౌలర్లతో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 200 దగ్గర తడబాటుతో కనిపించిన భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
 
 రెండో ఇన్నింగ్‌‌సలోనూ అర్ధసెంచరీతో భారత ఆధిక్యాన్ని పెంచాడు. భారత ప్రధాన బ్యాట్స్‌మెన్ ఆడటానికి తడబడ్డ పిచ్‌పై అతను అలవోకగా పరుగులు చేయడంతో పాటు రెండు ఇన్నింగ్‌‌సలోనూ నాటౌట్‌గా నిలిచాడు. లోయర్ ఆర్డర్‌లో బౌలర్ల సహకారంతో ఇన్నింగ్‌‌స నడిపే ఆటగాడి పాత్రను తను సమర్థంగా పోషించాడు.
 
 నిజానికి సాహా సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అయితే బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి క్రికెట్ అవకాశాల కోసం కోల్‌కతా వచ్చే వందలాదిమందిలో ఒకడిలా అతను కూడా వచ్చేశాడు. చిన్న వయసులోనే కోల్‌కతాలో స్థిరపడటం ద్వారా బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సాహా కెరీర్ మొత్తం ఎంతో సహనంతో సాగింది. కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, అవకాశాలు వచ్చినా రాకపోయినా అతను ప్రశాంతంగానే ఉండేవాడు. ఎందుకంటే అతని పూర్తి పేరు వృద్ధిమాన్ ప్రశాంత సాహా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement