మీరు క్రికెట్‌ను చంపేస్తున్నారు! | You are killing cricket ! | Sakshi
Sakshi News home page

మీరు క్రికెట్‌ను చంపేస్తున్నారు!

Published Tue, Nov 25 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

మీరు క్రికెట్‌ను చంపేస్తున్నారు!

మీరు క్రికెట్‌ను చంపేస్తున్నారు!

న్యూఢిల్లీ: బీసీసీఐ వ్యవహార శైలిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్రంగా విరుచుకుపడింది. క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తున్న భారత్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తూ ఈ ఆటను చంపేస్తున్నారంటూ పరుషంగా వ్యాఖ్యానించింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ అందించిన తుది నివేదికపై సోమవారం సుప్రీం కోర్టులో జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ మొహ మ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన బెంచ్ విచారణ  ప్రారంభించింది.

‘దేశంలోని ప్రజలు క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడుతుంటారు. ఈ ఆటను నిజమైన క్రీడా స్ఫూర్తితో ఆడాలి. జెంటిల్‌మన్ గేమ్‌గానే ఉండాలి. ఒకవేళ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లాంటి కార్యకలాపాలను అనుమతిస్తే.. మీరు (బీసీసీఐ) క్రికెట్‌ను చంపుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. మ్యాచ్‌లన్నీ ముందుగానే ఫిక్స్ అయ్యాయని తెలిస్తే వాటిని చూసేదెవరు? అభిమానుల విశ్వాసం కోల్పోతే క్రికెట్ అంతరిస్తుంది. ఐపీఎల్, బీసీసీఐకి మధ్య తేడా ఏమీ లేదు. బోర్డు నుంచి వచ్చిన ఉత్పత్తే ఐపీఎల్’ అని సుప్రీం తేల్చింది.

 క్రికెట్‌కు ఇంత పేరు తెచ్చింది ప్రేక్షకులే కదా: కోర్టు
 ఐపీఎల్ ప్రారంభించినప్పుడే వాణిజ్యపరంగా విజయవంతమైందని, దీనిపై వచ్చే ఆదాయం ద్వారా చాలా మంది జీవిస్తుండడంతో ఈ లీగ్ కొనసాగాలని బోర్డు తరఫు న్యాయవాది సీఏ సుందరం వాదించారు. భారత్‌లో క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అయితే ఈ వాదనపై కోర్టు ఘాటుగా స్పందించింది.

‘క్రికెట్‌కు ఆ గుర్తింపు ఎవరి ద్వారా వచ్చింది? ఈడెన్ గార్డెన్‌లో లక్ష మంది ప్రేక్షకులు కూర్చుని ఆటను ఆస్వాదించినప్పుడే ఇలాంటి గుర్తింపు వస్తుంది. అందుకే ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణికి సంబంధించింది’ అని తేల్చింది. స్పాట్ ఫిక్సింగ్‌లో దోషులుగా తేలిన వారిపై కేవలం పరిపాలనాపరమైన చర్యలే ఉంటాయా? అని బీసీసీఐని కోర్టు ప్రశ్నించింది. అయితే అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బోర్డు సమాధానమిచ్చింది.

 అధ్యక్షుడిగా ఉంటూ ఫ్రాంచైజీ నిర్వహిస్తారా?
 మరోవైపు ముద్గల్ కమిటీ నివేదికలో తన పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని తేలడంతో బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అనుమతించాలని శ్రీనివాసన్ కోర్టును కోరారు. అయితే ఆయన వాదనపై కోర్టు విభేదించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటూనే మరోవైపు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది.

‘ఐపీఎల్‌ను నిర్వహించే బోర్డుకు మీరే అధ్యక్షులు. అదే లీగ్‌లో తలపడే జట్టుకు యజమానిగా కూడా ఉంటున్నారు. ఇది పరస్పర ప్రయోజనాల సంఘర్షణ కిందికి రాదా? ఐపీఎల్ పాలక మండలిని ఏర్పాటు చేసింది ఎవరు? బీసీసీఐ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటారా?’ అని శ్రీని తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది.

అలాగే శ్రీనివాసన్ పునరాగమనం అంత సులువు కాదని చెప్పింది. ‘ముద్గల్ కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చిందని మీరు ఊహించుకుంటున్నారు. ఎన్నికల్లో నిలబడేందుకు బీసీసీఐ నిబంధనలు ఉపయోగించుకుంటే సరిపోదు. అందుకు ప్రజల విశ్వాసం కూడా తోడుగా ఉండాలి’ అని శ్రీనికి కోర్టు సూచించింది.
 
 ఆటగాళ్ల పేర్లు బయటపెట్టం: కోర్టు
 స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్ల పేర్లను వెల్లడించాలని బీహార్ క్రికెట్ సంఘం కౌన్సిల్ నళిని చిదంబరం కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ఈనెల 15న తామిచ్చిన తీర్పుకు కట్టుబడే ఉంటామని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement