
ఎం.కల్యాణ్‌కృష్ణ
ఆయనో మాజీ ఎస్సై... తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని, ఏదైనా సాధించాలనే తపనతో ఉద్యోగాన్ని వదిలేశారు. మారథాన్‌లు, 10కె రన్‌లు ఎన్ని గెలిచినా సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో జరిగే ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది జులై 29న జర్మనీలోని హ్యాంబర్గ్‌లోజరిగిన ఈవెంట్‌లో ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్‌లో జయకేతనం ఎగరేశారు. ఇది సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
సాక్షి, సిటీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎం.కల్యాణ్‌కృష్ణ ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం సిటీలో స్థిరపడిన ఈయనకు... చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. స్నేహితుల ద్వారా స్ఫూర్తి పొందిన కల్యాణ్ 2002లో ఎస్సై కొలువు కొట్టారు. కర్నూలు జిల్లాలో పోస్టింగ్ వచ్చింది. బండి ఆత్మకూరు సహా మరికొన్ని చోట్ల పని చేశారు. అయితే ఆయనకు ఏదో అసంతృప్తి... ఏదైనా సాధించాలనే తపన ఉండేది. తాను కోరుకున్న శిఖరాలను అధిరోహించాలంటే పోలీస్ ఉద్యోగంతో ఉండి సమయం
వెచ్చించలేమని భావించారు. దీంతో 2009లో ఉద్యోగాన్ని వదిలేసినా డిపార్ట్‌మెంట్ నేర్పిన క్రమశిక్షణతో పాటు ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఏపీ, తెలంగాణ హెచ్‌ఆర్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‌పై మక్కువతో వాటిని నిత్యం ప్రాక్టీస్ చేసే కల్యాణ్... ఓవైపు ఉద్యోగం చేస్తూనే, వారంలో ఒక్కో దానికి మూడు రోజులు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలోనే నగరంతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూర్‌లలో జరిగిన అనేక మారథాన్లు, 10కె రన్‌లలో పతకాలు సొంతం చేసుకున్నారు. వాటితో సంతృప్తి పడని కల్యాణ్ ‘ఐరన్‌మ్యాన్’ చాంపియన్‌షిప్ లక్ష్యంగా ఏడాది శ్రమించి విజయం సాధించారు.
నా సతీమణి సహకారం మరువలేను...
నేను ప్రాక్టీస్ కోసం కుటుంబానికి దూరమవుతుంటాను. సెలవు దినాల్లో ఉదయం 6గంటలకు సైక్లింగ్ మొదలుపెట్టి దాదాపు 50–70 కి.మీ వెళ్లొస్తాను. తిరిగి వచ్చేసరికి పూర్తిగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో నిత్యం నాకు మద్దతు తెలుపుతూ ఈ విజయాలకు కారణమైన నా భార్య సహకారం మరువలేను. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా ఇస్తుంది. ఈ ఫీట్స్‌లో కొన్ని రిస్కీ అయినప్పటికీ గెలిచిన తర్వాత ఎంతో సంతృప్తి ఉంటుంది. గెలుపోటములు పక్కన ఉంచితే ఇలాంటి చాంపియన్‌షిప్స్ జీవితంలో ఏదైనా సాధించగలమనే మనోధైర్యాన్నిస్తాయి. – కల్యాణ్‌కృష్ణ
సంస్థ స్పాన్సర్‌షిప్..
ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన లక్ష్యం సాధించేందుకు కల్యాణ్ ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొన్నారు. ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు నిత్యం ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రత్యేక డైట్ తీసుకుంటారు. ఇక ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన సైకిల్‌ను రూ.లక్ష వెచ్చించి కొనుగోలు చేశారు. కేవలం ఇదొక్కటేనా అవసరమైన ప్రతిదీ సొంత డబ్బుతోనే కొంటుంటారు. అంతేకాకుండా ఆయా దేశాలకు వెళ్లిరావడానికీ కల్యాణ్ భారీ మొత్తం వెచ్చిస్తుంటారు. ఏళ్లుగా మారథాన్‌లు, రన్‌లలో పాల్గొంటున్న ఈయనకు... ‘ఐరన్‌మ్యాన్’కు తొలిసారి ఫ్లిప్‌కార్ట్ స్పాన్సర్‌షిప్ లభించింది. తాను పని చేస్తున్న సంస్థ రూ.3లక్షల ఆర్థిక సాయం చేయడం విశేషం. కల్యాణ్ విమానంలో జర్మనీకి తన సైకిల్ కూడా తీసుకెళ్లారు.
ఇదీ ‘ఐరన్‌మ్యాన్’..
ప్రొఫెషనల్స్ కాకుండా నిరంతరం ప్రాక్టీస్ చేసే, సాధారణ వ్యక్తులు పాల్గొనే చాంపియన్‌షిప్ ఐరన్‌మ్యాన్. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ ఈవెంట్‌లో దాదాపు అన్ని దేశాల అభ్యర్థులు పాల్గొంటారు. ఇంటర్నేషనల్ ట్రైథ్లాన్ అసోసియేషన్ రెండు రకాలుగా ఈ పోటీలు నిర్వహిస్తుంది. హాఫ్ ఐరన్‌మ్యాన్ పోటీలో 1.9 కి.మీ ఈత, 90 కి.మీ సైక్లింగ్, 21 కి.మీ పరుగును 8గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐరన్‌మ్యాన్‌లో 3.8 కి.మీ ఈత, 180 కి.మీ సైక్లింగ్, 42 కి.మీ పరుగును 16గంటల్లో పూర్తి చేయాలి. ప్రతి పోటీలో మూడు ఈవెంట్స్‌కు మధ్యలో ఆగేందుకు, విశ్రాంతి తీసుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. రేస్‌లో ఉన్నంతసేపూ కేవలం ద్రవపదార్థాలే తీసుకుంటారు. అదీ సైక్లింగ్ చేస్తూనో, పరుగెడుతూనో సహాయకులు అందించేవి మాత్రమే తాగే అవకాశం ఉంటుంది. గతేడాది మలేసియాలోని లంకావి దీవిలో జరిగిన హాఫ్ ఐరన్‌మ్యాన్‌ను, ఈ ఏడాది హ్యంబర్గ్‌లో జరిగిన ఐరన్‌మ్యాన్ చాంపియన్‌షిప్‌ను కల్యాణ్ కృష్ణ గెలుచుకున్నారు. ఈ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 1600 మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment