
25కే రన్ లో యువీ-నేహాల సందడి
కోల్ కతా:దాదాపు 20 నెలల అనంతరం భారత జాతీయ క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్.. నగరంలో ఆదివారం నిర్వహించిన 'టాటా స్టీల్ కోల్ కతా 25 కే రన్' కార్యక్రమంలో సందడి చేశాడు. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో కలిసి యువీ అభిమానుల్ని అలరించాడు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఈ ఇద్దరు సెలబ్రిటీలు హాజరు కావడంతో అక్కడ మంచి జోష్ కనిపించింది. గతంలో వీరిద్దరి ప్రేమాయణం కొనసాగి డేటింగ్ వరకూ వెళ్లిందనే వార్తలు అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి. అటు తరువాత కూడా యువీ మరికొందరు బాలీవుడ్ భామలతో కూడా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే బాలీవుడ్ భామలతో ప్రేమ వ్యవహారాన్ని డేటింగ్ వరకే పరిమితం చేయాలనుకున్నాడో?ఏమో కానీ.. ఆ తరువాత బ్రిటీష్ నటి హాజల్ కీచ్ తో ప్రేమాయణం కొనసాగించాడు. ఇటీవల యువీ-హాజల్ కిచ్ ల నిశ్చితార్థం కూడా జరిగింది. వీరిద్దరూ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.