'యువరాజ'సం వెలిగేనా?
వెస్టిండీస్-ఎతో అనధికారిక మూడు వన్డేల సిరీస్లో భారత్-ఎ ఓడిపోయినా డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు మాత్రం భలేగా కలిసొచ్చింది. టీమిండియా బెర్తు కోసం నిరీక్షిస్తున్న యువీ ఈ సిరీస్ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని మళ్లీ ఫామ్ అందుకున్నాడు. మెరుపు సెంచరీతో చెలరేగి ఒకప్పటి యువరాజ్ను గుర్తుకు తెచ్చాడు. తద్వారా తనలో ఇంకా వాడి తగ్గలేదని జాతీయ సెలెక్టర్లకు సంకేతాలు పంపాడు. 'యువీ అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. టీమిండియాలో యువీకి చోటు దొరుకుతుందని భావిస్తున్నా. మిడిలార్డర్లో అతని అవసరం జట్టుకుంది' అంటూ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
కరీబియన్లతో ఇటీవల ముగిసిన సిరీస్కు ముందు 32 ఏళ్ల యువరాజ్పై పెద్దగా అంచనాల్లేవు. ఐతే మూడు మ్యాచ్ల్లో వరుసగా 123, 40, 61 పరుగులు చేసి అభిమానులను అలరించాడు. తొలి వన్డేలో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో కదంతొక్కి మెరుపు సెంచరీ నమోదు చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు త్వరలో జట్టును ఎంపిక చేయనున్నారు. విండీస్ సిరీస్లో యువ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే బెర్తు దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. ఐతే యువ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. సూపర్ ఫామ్తో నిలకడగా రాణిస్తున్న జడేజా జాతీయ జట్టులో పాతుకుపోయాడు. మరి కొందరు యువ క్రికెటర్ల పరిస్థితి ఇంతే. ఈ నేపథ్యంలో యువీని టీమిండియా బెర్తు వరిస్తుందో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
జాతీయ జట్టులో చోటు కోల్పోవడం, మళ్లీ రావడం యువీకి కొత్తేమీ కాదు. 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ముందు కూడా యువీ ఫామ్పై విమర్శలు వచ్చాయి. టీమిండియాలోకి అతణ్నితీసుకోవడంపై విశ్లేషకులు పెదవి విరిచారు. ఐతే యువీ అందరి సందేహాల్ని పటాపంచలు చేస్తూ బంతితో విజృంభించాడు. ఈ మెగా ఈవెంట్లో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచి, భారత్ ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత యువీ ప్రాణాంతక కేన్సర్ బారిన పడటం కెరీర్కు ప్రతికూలంగా మారింది. కేన్సర్ను జయించాక పునరాగమనం చేసినా మునుపటి స్థాయిలో ఆడలేకపోయాడు. దీంతో మళ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. సీనియర్లు సెహ్వాగ్, గంభీర్, హర్భజన్, జహీర్ తదితరులు కూడా ఫామ్లేమితో దూరమయ్యారు. ఇదే సమయంలో యువ క్రికెటర్లు అనతి కాలంలోనే సత్తా నిరూపించుకుని టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించారు. దీంతో సీనియర్ల పునరాగమనం సందేహంగా మారింది.