
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 సీజన్‌కు ముందు టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ తన ఫామ్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో విఫలమైన యువరాజ్.. కనీసం ఐపీఎల్ ఆరంభమయ్యే సరికి గాడిలో పడాలని భావిస్తున్నాడు. తాజాగా మాల్దీవుల్లో ఎయిర్ ఇండియా తరఫున ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన యువరాజ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రెండురోజుల క్రితం ఎకువేని స్పోర్ట్స్ గ్రౌండ్‌లో మాల్దీవ్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రివర్స్ స్వీప్‌లో కొట్టిన సిక్స్ పాత యువీని గుర్తుకు తెచ్చింది. దీనికి సంబంధించి స్విచ్ హిట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2017, ఫిబ్రవరిలో భారత్ తరఫున చివరిసారి టీ20 మ్యాచ్ ఆడిన యువీ.. అదే ఏడాది జూన్‌లో ఆఖరిసారి వన్డే ఆడాడు. ఆ తర్వాత భారత జట్టులో పునరాగమనం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న యువీ పెద్దగా ఆకట్టుకోలేదు. రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్ తరుపున మొత్తం 14 మ్యాచ్‌లాడిన యువరాజ్ సింగ్ 99 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్‌కప్‌కు కొద్ది నెలలు సమయం ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్‌లో సత్తా చాటాలని యువరాజ్ ఊవిళ్లూరుతున్నాడు. ఈ ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలోనూ తొలుత అమ్ముడుపోలేదు. కనీస ధర రూ.కోటితో వేలంలోకి వచ్చిన యువీని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీలు ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు. చివరకు రెండో రౌండ్‌లో కనీస ధరకే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment