
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం
ముంబై: జట్టులో చోటు కోల్పోయిన ఏడాది కాలం అనంతరం మరోసారి పేసర్ జహీర్ ఖాన్‌కు అవకాశమొచ్చింది. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న జహీర్.. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన మూడు రంజీ మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసిన 35 ఏళ్ల ఈ పేసర్ తన చివరి టెస్టును గతేడాది డిసెంబర్‌లో ఇంగ్లండ్‌పై ఆడాడు. ‘సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను.
నా చివరి పునరాగమనం కూడా దక్షిణాఫ్రికాపైనే జరిగింది. అక్కడ నాకు మంచి జ్ఞాపకాలున్నాయి. ఈసారి కూడా మెరుగ్గానే రాణిస్తానని అనుకుంటున్నాను. ఈనెల 28 నుంచి విదర్భతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాను. సఫారీ పర్యటనకు ముందు ఈ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ లభిస్తుందనుకుంటున్నాను. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు ఎంతో ఆలోచించాను. నా ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుని తిరిగి జట్టులో చోటు సాధిస్తానా? లేదా? అని ప్రశ్నించుకున్నాను.
సాధిస్తాననే నమ్మకంతో శారీరకంగా ఎంతోశ్రమించాను. చాలామంది ట్రైనర్లు, ఫిజియోలతో సంప్రదించాను. ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి ఈ స్థాయిలో ఉండగలిగాను’ అని జహీర్ అన్నాడు. విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మహ్మద్ షమీ రాణించిన తీరు అద్భుతమని కొనియాడాడు. కొత్త బంతితోనే కాకుండా పాత బంతితోనూ సత్తా చూపగలిగాడని అన్నాడు.