'రిటైర్మెంట్ నిర్ణయంపై బాధలేదు'
టీమిండియా సీనియర్ పేసర్ ఆశీష్ నెహ్రా లేటు వయసులో అదరగొడుతున్నాడు. 36 ఏళ్ల నెహ్రా ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్లలో సత్తాచాటి శభాష్ అనిపించుకున్నాడు. నెహ్రా ప్రదర్శన భారత్ మాజీ పేసర్ జహీర్ ఖాన్ ను ఆకట్టుకుంది. తనకు స్ఫూర్తినిచ్చిందని జహీర్ చెప్పాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను వైదొలిగినందుకు బాధగా లేదని 37 ఏళ్ల జహీర్ చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చివరిసారి ఆడనున్న జహీర్ ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహిస్తాడు.
'అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నేను తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. దీనికే కట్టుబడి ఉంటాను. నెహ్రా రాణించినందుకు సంతోషంగా ఉంది. నాకు స్ఫూర్తి కలిగించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడుతున్నా. యువ బౌలర్లకు సలహాలు ఇస్తూ సీజన్ను ఆస్వాదిస్తా' అని జహీర్ అన్నాడు.
ఐపీఎల్ వల్ల బౌలర్లకు పెద్దగా ఉపయోగం ఉండదని జహీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ప్రదర్శనతో బౌలర్లు అంతర్జాతీయ వన్డేలు, టెస్టులకు ఎంపిక కావడం కష్టమని చెప్పాడు. బౌలర్లకు భిన్నమైన నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నాడు. వన్డేలు, టెస్టులతో పోలిస్తే టి-20 ఫార్మాట్ పూర్తిగా భిన్నమైదని అన్నాడు.