
20 పరుగులు .. ఏడు వికెట్లు
హరారే: మూడు వన్డేల సిరీస్ల భాగంగా సోమవారం ఇక్కడ భారత్తో జరుగుతున్న రెండో వన్డే లో జింబాబ్వే 127 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆదిలోనే మసకద్జా(9) నిరాశపరచగా, ఆపై మూర్(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 19 పరుగులకే జింబాబ్వే రెండు వికెట్లను నష్టపోయింది. కాగా, చిబాబా(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సిబందా(53) ఆకట్టుకున్నాడు. సిబందా-సికిందర్ రాజా(16)ల జోడి నాల్గో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.
ఆ తరువాత జింబాబ్వే వరుసగా క్యూకట్టడంతో 34.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఆదిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తరువాత చతికిలబడింది. 25.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసిన జింబాబ్వే.. మరో 2 0 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో చాహల్ మూడు వికెట్లు సాధించగా, బరిందర్ శ్రవణ్, కులకర్ణిలకు తలో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, బూమ్రాలకు చెరో వికెట్ దక్కాయి.తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.