
జింబాబ్వే నడ్డివిరిచిన బూమ్రా
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
హరారే: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జింబాబ్వే జట్టులో చిగుంబరా(41)మినహా ఎవరూ ఆకట్టుకోలేదు టాస్ గెలిచిన ధోని తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే ఆటగాళ్లలో మూర్(3), మసకద్జా(14) , చిబాబా(13) స్వల్ప విరామాల్లో నిష్క్రమించడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.
అనంతరం సిబందా(5), ఎర్విన్(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. ఆపై చిగుంబరాకు జత కలిసిన సికిందర్ రాజా(23) జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడీ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జింబాబ్వే వికెట్లకు కాసేపు బ్రేక్ పడింది. కాగా, సికిందర్ రాజా ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాక, మరోసారి జింబాబ్వే తడబడింది. అయితే చిగుంబరా తొమ్మిదో వికెట్గా వరకూ క్రీజ్ లో ఉండటంతో జింబాబ్వే 168 పరుగుల సాధారణ స్కోరును నమోదు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు వికెట్లు తీసి జింబాబ్వే నడ్డి విరిచాడు. బూమ్రా 9.5 ఓవర్లలో రెండు మేడిన్ల సాయంతో 28 పరుగులు ఇచ్చాడు. టీమిండియా మిగతా బౌలర్లలో బరిందర్ శ్రవణ్, కులకర్ణిలు తలో రెండు వికెట్లు సాధించగా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, చాహల్లు చెరో వికెట్ లభించింది.