ఈ చిత్రం చూసి పాన్‌షాప్ అనుకుంటే పొరపాటే! మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోని తిర్లంగి గ్రామంలోని బెల్ట్‌షాప్ అది. లైసెన్స్‌డ్ మద్యం దుకాణం మాదిరిగానే ఇనుపరేకులతో పక్కాగా పర్మిట్‌రూమ్‌నూ ఏర్పాటు చేసుకున్నారు. విచ్చలవిడిగా మద్యం అనధికార విక్రయాలతో మందుబాబుల వీరంగం ఎక్కువైంది. ఇక సంక్రాంతి, కనుమ పండుగలకు మరింత పేట్రేగిపేతే గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందనే ఆందోళనతో తిర్లంగి గ్రామస్తులు ఇటీవల నేరుగా రాజధానిలోని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు! మరేమైంది?
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఫిర్యాదుతో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పందించింది! జిల్లా సిబ్బందిని దాడులకు పంపించింది! బెల్ట్‌షాపును సీజ్ చేశారు. నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో చర్యలు ఆగిపోయాయి! మరి ఆ మద్యం సరఫరా చేసిన వ్యాపారికి చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానా వేశారా? అతని దుకాణం లైసెన్స్ రద్దుకు సిఫారసు చేశారా? అని ప్రశ్నిస్తే... అక్కడి పరిస్థితి చూస్తే అలాంటి పరిస్థితి ఉత్పన్నంగాకుండా కేసును తేల్చేశారని విశ్వసనీయ సమాచారం. దీనివెనుక మంత్రి మంత్రాంగం పనిచేసిందని తెలిసింది. ఒకవైపు బెల్ట్ దుకాణాలు కనిపిస్తే తాటతీస్తా అని ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలు సొంత పార్టీ నాయకుల అనుచరులకు వర్తించవా? అని ప్రజలు విస్తుపోతున్నారు.
డైరెక్టరేట్ నుంచే మళ్లీ ఆదేశాలు!
తిర్లంగి ప్రజల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. తిర్లంగిలోని బెల్ట్‌షాపులో మద్యం విక్రయాలు జరుగుతుండటంతో దాన్ని సీజ్ చేశారు. నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆ బెల్ట్‌షాప్‌కు మద్యం సరఫరా చేసిన లైసెన్స్‌డ్ మద్యం వ్యాపారిపైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. సంబంధిత దుకాణం సీజ్ చేయాలి. రూ.లక్ష వరకూ జరిమానా విధించాలి. అది చెల్లించిన తర్వాతే మళ్లీ ఆ వ్యాపారి మద్యం విక్రయానికి అనుమతి ఉంటుంది.
కానీ తిర్లంగిలో బెల్ట్‌షాప్‌కు టెక్కలిలో ఏ దుకాణం నుంచి మద్యం వచ్చిందో, దాని యజమాని ఎవ్వరో నిర్వాహకుడికి తెలుసు కదా? కానీ ఆ వ్యాపారిపై ఈగ కూడా వాలలేదు! సరికదా... తనను ఏమీ చేయలేకపోయారని తమకే సవాలు విసిరాడని తిర్లంగి గ్రామస్థులు వాపోతున్నారు. అతనికి మంత్రి మద్దతు ఉండటం వల్లే కొందరు మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఎక్సైజ్ సిబ్బంది దాడుల గురించి తెలిసిన వెంటనే మంత్రి నేరుగా రాజధానిలోని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులతోనే మాట్లాడి ఇక్కడి సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు.
దీంతో కేవలం బెల్ట్‌షాపు నిర్వాహకుడిపై కేసుతోనే చర్యలు సరిపెట్టేశారని తిర్లంగి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులతో అడ్డుకట్ట పడట్లేదని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదని విమర్శిస్తున్నారు. బెల్ట్‌షాపుల నిర్వాహకుల తాటతీస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలు కూడా క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకుల ముందు పనిచేయట్లేదని ఆరోపిస్తున్నారు.
టెక్కలి అడ్డాగా అక్రమ మద్యం...
బెల్ట్‌షాపులకే కాదు కల్తీ మద్యం, దుకాణాల వద్దే అక్రమంగా లూజు అమ్మకాలు, ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు టెక్కలి నియోజకవర్గం అడ్డాగా మారిందనడానికి గతంలో అనేక ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక టెక్కలిలోనే గాకుండా జిల్లాఅంతటా చక్రం తిప్పుతున్న మద్యం సిండికేట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి అధికార పార్టీలో కీలక నాయకుడికి కుడిభుజంగా పనిచేస్తున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి.
పండుగకు ‘మందు’ జాగ్రత్త...
జిల్లాలో 238 మద్యం దుకాణాలు, 17 బార్‌లు ఉన్నాయి. వాటికి ఎచ్చెర్లలోని ఏపీ బ్రూవరీస్ గోదాం నుంచి రోజుకు సగటున రూ.4 కోట్ల విలువలైన మద్యం సరఫరా అవుతోంది. కానీ సంక్రాంతి, కనుమ పండుగల దృష్ట్యా ఈనెల 12వ తేదీన ఏకంగా రూ.6.65 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. మరో విషయమేమిటంటే 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ అంటే ఐదు రోజుల వ్యవధిలో దాదాపు రూ.23.41 కోట్ల మేర మద్యం దుకాణాలకు వెళ్లిందంటే ఈ పండుగకు ఎంతమేర మద్యం ఏరులై ప్రవహిస్తుందో ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment