minister followers
-
ప్రజల ఘోష పట్టని.. ప్రజాప్రతినిధి!
ఈ చిత్రం చూసి పాన్‌షాప్ అనుకుంటే పొరపాటే! మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోని తిర్లంగి గ్రామంలోని బెల్ట్‌షాప్ అది. లైసెన్స్డ్ మద్యం దుకాణం మాదిరిగానే ఇనుపరేకులతో పక్కాగా పర్మిట్రూమ్నూ ఏర్పాటు చేసుకున్నారు. విచ్చలవిడిగా మద్యం అనధికార విక్రయాలతో మందుబాబుల వీరంగం ఎక్కువైంది. ఇక సంక్రాంతి, కనుమ పండుగలకు మరింత పేట్రేగిపేతే గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందనే ఆందోళనతో తిర్లంగి గ్రామస్తులు ఇటీవల నేరుగా రాజధానిలోని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు! మరేమైంది? సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఫిర్యాదుతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించింది! జిల్లా సిబ్బందిని దాడులకు పంపించింది! బెల్ట్‌షాపును సీజ్ చేశారు. నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో చర్యలు ఆగిపోయాయి! మరి ఆ మద్యం సరఫరా చేసిన వ్యాపారికి చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానా వేశారా? అతని దుకాణం లైసెన్స్ రద్దుకు సిఫారసు చేశారా? అని ప్రశ్నిస్తే... అక్కడి పరిస్థితి చూస్తే అలాంటి పరిస్థితి ఉత్పన్నంగాకుండా కేసును తేల్చేశారని విశ్వసనీయ సమాచారం. దీనివెనుక మంత్రి మంత్రాంగం పనిచేసిందని తెలిసింది. ఒకవైపు బెల్ట్ దుకాణాలు కనిపిస్తే తాటతీస్తా అని ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలు సొంత పార్టీ నాయకుల అనుచరులకు వర్తించవా? అని ప్రజలు విస్తుపోతున్నారు. డైరెక్టరేట్ నుంచే మళ్లీ ఆదేశాలు! తిర్లంగి ప్రజల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. తిర్లంగిలోని బెల్ట్‌షాపులో మద్యం విక్రయాలు జరుగుతుండటంతో దాన్ని సీజ్ చేశారు. నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆ బెల్ట్‌షాప్‌కు మద్యం సరఫరా చేసిన లైసెన్స్డ్ మద్యం వ్యాపారిపైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. సంబంధిత దుకాణం సీజ్ చేయాలి. రూ.లక్ష వరకూ జరిమానా విధించాలి. అది చెల్లించిన తర్వాతే మళ్లీ ఆ వ్యాపారి మద్యం విక్రయానికి అనుమతి ఉంటుంది. కానీ తిర్లంగిలో బెల్ట్‌షాప్‌కు టెక్కలిలో ఏ దుకాణం నుంచి మద్యం వచ్చిందో, దాని యజమాని ఎవ్వరో నిర్వాహకుడికి తెలుసు కదా? కానీ ఆ వ్యాపారిపై ఈగ కూడా వాలలేదు! సరికదా... తనను ఏమీ చేయలేకపోయారని తమకే సవాలు విసిరాడని తిర్లంగి గ్రామస్థులు వాపోతున్నారు. అతనికి మంత్రి మద్దతు ఉండటం వల్లే కొందరు మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఎక్సైజ్ సిబ్బంది దాడుల గురించి తెలిసిన వెంటనే మంత్రి నేరుగా రాజధానిలోని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతోనే మాట్లాడి ఇక్కడి సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో కేవలం బెల్ట్‌షాపు నిర్వాహకుడిపై కేసుతోనే చర్యలు సరిపెట్టేశారని తిర్లంగి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులతో అడ్డుకట్ట పడట్లేదని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదని విమర్శిస్తున్నారు. బెల్ట్‌షాపుల నిర్వాహకుల తాటతీస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలు కూడా క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకుల ముందు పనిచేయట్లేదని ఆరోపిస్తున్నారు. టెక్కలి అడ్డాగా అక్రమ మద్యం... బెల్ట్‌షాపులకే కాదు కల్తీ మద్యం, దుకాణాల వద్దే అక్రమంగా లూజు అమ్మకాలు, ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు టెక్కలి నియోజకవర్గం అడ్డాగా మారిందనడానికి గతంలో అనేక ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక టెక్కలిలోనే గాకుండా జిల్లాఅంతటా చక్రం తిప్పుతున్న మద్యం సిండికేట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి అధికార పార్టీలో కీలక నాయకుడికి కుడిభుజంగా పనిచేస్తున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి. పండుగకు ‘మందు’ జాగ్రత్త... జిల్లాలో 238 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి. వాటికి ఎచ్చెర్లలోని ఏపీ బ్రూవరీస్ గోదాం నుంచి రోజుకు సగటున రూ.4 కోట్ల విలువలైన మద్యం సరఫరా అవుతోంది. కానీ సంక్రాంతి, కనుమ పండుగల దృష్ట్యా ఈనెల 12వ తేదీన ఏకంగా రూ.6.65 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. మరో విషయమేమిటంటే 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ అంటే ఐదు రోజుల వ్యవధిలో దాదాపు రూ.23.41 కోట్ల మేర మద్యం దుకాణాలకు వెళ్లిందంటే ఈ పండుగకు ఎంతమేర మద్యం ఏరులై ప్రవహిస్తుందో ఊహించవచ్చు. -
‘మంత్రి అనుచరులతో మాకు ప్రాణ హాని ఉంది’
సాక్షి, తిరుపతి: మంత్రి అమర్నాథ్రెడ్డి అనుచరులతో ప్రాణ హాని ఉందని నారాయణపురానికి చెందిన పుణ్యవతి అనే మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా మంత్రి అల్లుడితోపాటు, ఆయన అనుచరులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారని ఆమె తెలిపింది. తమ రెండెకరాల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు మంత్రి అనుచరులు యత్నిస్తున్నారని మహిళ తెలిపింది. అంతేకాక, రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై మంత్రి అమర్నాథ్రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. గత రాత్రి పొలం వద్ద ఉన్న సమయంలో మంత్రి అనుచరులు హతమర్చేందుకు ప్రయత్నాం చేశారని మహిళ చెప్పింది. మాకు ఏమైనా జరిగితే అందుకు మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుచరులే కారణమని పుణ్యవతి, ఆమె సోదరీమణులు ఆరోపించారు. -
‘భూ’ మంత్రికాళీ
► భూదందాల్లో దొందూ దొందే ► ఓ డాక్టర్ భూమిని కబ్జా చేసిన మంత్రి అనుచరులు ► న్యాయం కోరితే ఇక ఆ స్థలం నాదే.. మర్చిపొమ్మని అమాత్యుని హుకుం ►సెటిల్మెంట్ కోసం మరో మంత్రిని కలిసిన వైద్యుడు ► సెటిల్ చేస్తా.. కానీ ఆ స్థలం నాకు వదిలేయ్.. ► ఎంతో కొంత ఇస్తానని బేరమాడిన సదరు సచివుడు ► వైద్యవర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న భూఆక్రమణ అతనో వైద్యుడు.. రోగాలను నయం చేయడం ఆయన వృత్తి..కానీ ఆయనే భూకబ్జా అనే భూతం బారిన పడి బాధితుడయ్యాడు.. దాన్ని నయం చేయడం తన వల్ల కాలేదు.. దాని బారి నుంచి తనను రక్షించమని ఇద్దరు ప్రముఖులను ఆశ్రయించాడు.. ఆ చికిత్స చేసేందుకు వారు డిమాండ్ చేసిన ఫీజు విని.. అతని దిమ్మదిరిగింది.. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకున్నారు?!.. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు.. పైగా అమాత్యవర్యులు..!! వారడిగిన ఫీజు ఏమిటో తెలుసా??.. ఆ భూమి విషయమే మరిచిపోండి.. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు.. అని ఒక అమాత్యుడు సలహా ఇచ్చారు.. ఆ భూమిని నాకిచ్చేయ్.. బదులుగా ఓ పాతిక శాతం రేటు నీకిస్తా.. అని ఇంకో మంత్రి పుంగవుడు బేరం పెట్టారు!!.. దాంతో పాపం.. ఆ డాక్టరుగారు.. బిత్తరపోయి బిక్కచచ్చిపోయారు?? సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భూ కుంభకోణాలపై ప్రభుత్వం కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నప్పటికీ ప్రజలు. ముఖ్యంగా బాధితుల్లో వచ్చిన చైతన్యంతో ఒక్కో దందా బయటికొస్తోంది. విదేశాలకు వెళ్లి కష్టపడి సంపాదించిన సొమ్ముతో మధురవాడలో ఓ భూమి కొనుగోలు చేసిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన మంత్రుల బాగోతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన పేరుమోసిన చిన్న పిల్లల వైద్యుడు కొన్నేళ్ల కితం అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆ తర్వాత సొంతూరు విశాఖ వచ్చి జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో చిన్న పిల్లల ఆస్పత్రి నెలకొల్పారు. దాని విస్తరణలో భాగంగా నగర శివారులో అతి పెద్ద ఆస్పత్రి నెలకొల్పాలని భావించాడు. ఈ మేరకు మధురవాడలో సుమారు వెయ్యి గజాల స్థలం కొనుగోలు చేశారు. విలువైన ఆ భూమిపై ఒక మంత్రి అనుచరుల కన్ను పడింది. దాన్ని ఆక్రమించి ఆ స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి దిగారు. బిత్తరపోయిన డాక్టరు తన తోటి డాక్టర్ల ద్వారా ఎలాగోలా నేరుగా మంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఆయనకు మంత్రి నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ‘అవును.. నాకు తెలుసు .. ఆ భూమి మాకు కావాలి.. నువ్వు వదిలేయ్’ అని మొహం మీదే చెప్పేశారు. వైద్యుడు ఏమీ చేయలేక అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఎంతో కొంత ఇస్తా.. ఆ భూమి నాకు వదిలెయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు.. సదరు మంత్రికి ధీటుగా ఢీ అంటే ఢీ అనే మంత్రి ఉన్నారని సన్నిహితులు చెప్పడంతో రాష్ట్రానికే చెందిన మరో మంత్రిని డాక్టర్ కలిశారు. తన భూమి కబ్జా అయిన వైనంపై మొరపెట్టుకున్నారు. ఇందుకు ఆ మంత్రి స్పం దిస్తూ ‘వ్యవహారం నేను సెటిల్ చేస్తా.. ఎం తిస్తావ్’.. అని అడిగారట. ‘స్థలం విలువలో పాతిక శాతం ఇస్తానని డాక్టర్ చెప్పగా ‘అదే నేను నీకిస్తా.. భూమి నాకు ఇచ్చేయ్’.. అని చల్లగా చెప్పడంతో డాక్టర్ షాక్ అయ్యారు. ‘అదేంటి సార్.. నేను కష్టపడి కొనుక్కున్న భూమి... కావాలంటే ఇంకో పది శాతం ఎక్కువిస్తా.. నా భూమి నాకు వచ్చేటట్టు చూడండి’.. అని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ‘భూమి నాకు రాసిస్తానంటేనే సెటిల్మెంట్.. లేదంటే లేదు’.. అని ఆ సీనియర్ మంత్రి ఖరాకండీగా చెప్పడంతో ఆ డాక్టర్ ఆలోచించుకుని చెబుతానని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారట. ఇప్పటికీ సెటిల్ కాని ఆ భూ పంచాయితీపై ఏది జరిగితే అదే జరుగుతుందని భావించిన వైద్యుడు చివరికి ఆక్రమణదారులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రముఖ డాక్టరే భూకబ్జా బాధితుడిగా మారడం.. ఇప్పుడు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా వెలుగులోకి వస్తున్న భూ కుంభకోణాల నేపథ్యంలో తమ డాక్టర్‌కు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలిసేలా బట్టబయలు చేయాలని తొలుత వైద్యులు భావించారు. అయితే భూ కబ్జాదారులను రక్షించే విధంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని తాజా పరిణామాలతో అర్ధమైంది. దీంతో ఆ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చి అధికార పార్టీ నేతలకు ఎందుకు టార్గెట్ కావాలన్న యోచనలో బాధిత డాక్టర్ కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది.