► భూదందాల్లో దొందూ దొందే
► ఓ డాక్టర్ భూమిని కబ్జా చేసిన మంత్రి అనుచరులు
► న్యాయం కోరితే ఇక ఆ స్థలం నాదే.. మర్చిపొమ్మని అమాత్యుని హుకుం
►సెటిల్‌మెంట్ కోసం మరో మంత్రిని కలిసిన వైద్యుడు
► సెటిల్ చేస్తా.. కానీ ఆ స్థలం నాకు వదిలేయ్..
► ఎంతో కొంత ఇస్తానని బేరమాడిన సదరు సచివుడు
► వైద్యవర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న భూఆక్రమణ
అతనో వైద్యుడు.. రోగాలను నయం చేయడం ఆయన వృత్తి..కానీ ఆయనే భూకబ్జా అనే భూతం బారిన పడి బాధితుడయ్యాడు.. దాన్ని నయం చేయడం తన వల్ల కాలేదు..
దాని బారి నుంచి తనను రక్షించమని ఇద్దరు ప్రముఖులను ఆశ్రయించాడు.. ఆ చికిత్స చేసేందుకు వారు డిమాండ్ చేసిన ఫీజు విని.. అతని దిమ్మదిరిగింది..
ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకున్నారు?!.. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు.. పైగా అమాత్యవర్యులు..!!
వారడిగిన ఫీజు ఏమిటో తెలుసా??..
ఆ భూమి విషయమే మరిచిపోండి.. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు.. అని ఒక అమాత్యుడు సలహా ఇచ్చారు..
ఆ భూమిని నాకిచ్చేయ్.. బదులుగా ఓ పాతిక శాతం రేటు నీకిస్తా.. అని ఇంకో మంత్రి పుంగవుడు బేరం పెట్టారు!!..
దాంతో పాపం.. ఆ డాక్టరుగారు.. బిత్తరపోయి బిక్కచచ్చిపోయారు??
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భూ కుంభకోణాలపై ప్రభుత్వం కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నప్పటికీ ప్రజలు. ముఖ్యంగా బాధితుల్లో వచ్చిన చైతన్యంతో ఒక్కో దందా బయటికొస్తోంది. విదేశాలకు వెళ్లి కష్టపడి సంపాదించిన సొమ్ముతో మధురవాడలో ఓ భూమి కొనుగోలు చేసిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన మంత్రుల బాగోతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన పేరుమోసిన చిన్న పిల్లల వైద్యుడు కొన్నేళ్ల కితం అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆ తర్వాత సొంతూరు విశాఖ వచ్చి జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో చిన్న పిల్లల ఆస్పత్రి నెలకొల్పారు.
దాని విస్తరణలో భాగంగా నగర శివారులో అతి పెద్ద ఆస్పత్రి
నెలకొల్పాలని భావించాడు. ఈ మేరకు మధురవాడలో సుమారు వెయ్యి గజాల స్థలం కొనుగోలు చేశారు. విలువైన ఆ భూమిపై ఒక మంత్రి అనుచరుల కన్ను పడింది. దాన్ని ఆక్రమించి ఆ స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి దిగారు. బిత్తరపోయిన డాక్టరు తన తోటి డాక్టర్ల ద్వారా ఎలాగోలా నేరుగా మంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఆయనకు మంత్రి నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ‘అవును.. నాకు తెలుసు .. ఆ భూమి మాకు కావాలి.. నువ్వు వదిలేయ్’ అని మొహం మీదే చెప్పేశారు. వైద్యుడు ఏమీ చేయలేక అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.
ఎంతో కొంత ఇస్తా.. ఆ భూమి నాకు వదిలెయ్
ఆ తర్వాత కొన్నాళ్లకు.. సదరు మంత్రికి ధీటుగా ఢీ అంటే ఢీ అనే మంత్రి ఉన్నారని సన్నిహితులు చెప్పడంతో రాష్ట్రానికే చెందిన మరో మంత్రిని డాక్టర్ కలిశారు. తన భూమి కబ్జా అయిన వైనంపై మొరపెట్టుకున్నారు. ఇందుకు ఆ మంత్రి స్పం దిస్తూ ‘వ్యవహారం నేను సెటిల్ చేస్తా.. ఎం తిస్తావ్’.. అని అడిగారట. ‘స్థలం విలువలో పాతిక శాతం ఇస్తానని డాక్టర్ చెప్పగా ‘అదే నేను నీకిస్తా.. భూమి నాకు ఇచ్చేయ్’.. అని చల్లగా చెప్పడంతో డాక్టర్ షాక్ అయ్యారు. ‘అదేంటి సార్.. నేను కష్టపడి కొనుక్కున్న భూమి... కావాలంటే ఇంకో పది శాతం ఎక్కువిస్తా.. నా భూమి నాకు వచ్చేటట్టు చూడండి’.. అని వేడుకున్నా ఫలితం లేకపోయింది.
‘భూమి నాకు రాసిస్తానంటేనే సెటిల్‌మెంట్.. లేదంటే లేదు’.. అని ఆ సీనియర్ మంత్రి ఖరాకండీగా చెప్పడంతో ఆ డాక్టర్ ఆలోచించుకుని చెబుతానని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారట. ఇప్పటికీ సెటిల్ కాని ఆ భూ పంచాయితీపై ఏది జరిగితే అదే జరుగుతుందని భావించిన వైద్యుడు చివరికి ఆక్రమణదారులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రముఖ డాక్టరే భూకబ్జా బాధితుడిగా మారడం.. ఇప్పుడు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా వెలుగులోకి వస్తున్న భూ కుంభకోణాల నేపథ్యంలో తమ డాక్టర్‌కు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలిసేలా బట్టబయలు చేయాలని తొలుత వైద్యులు భావించారు. అయితే భూ కబ్జాదారులను రక్షించే విధంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని తాజా పరిణామాలతో అర్ధమైంది. దీంతో ఆ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చి అధికార పార్టీ నేతలకు ఎందుకు టార్గెట్ కావాలన్న యోచనలో బాధిత డాక్టర్ కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది.
‘భూ’ మంత్రికాళీ
Published Tue, Jun 20 2017 12:47 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
Advertisement
Advertisement