నోట్ల రద్దు అనంతరం పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తింపు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన అవకతవకలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 27 మంది సీనియర్ అధికారుల్ని కేంద్రం సస్పెండ్ చేసి, ఆరుగుర్ని బదిలీ చేసింది. వీరంతా పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో వీరి అక్రమాలు వెలుగు చూశారుు. బెంగళూరులో ఇద్దరు వ్యాపార వేత్తల నుంచి కొత్త నోట్ల రూపంలో గురువారం రూ. 5.7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని అక్రమాల్లో అధికారుల పాత్ర ఉందని తేలిందని, ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా వారు పనిచేసినట్లు గుర్తించామని ఆర్థిక శాఖ వెల్లడించింది.
అక్రమాల్ని సహించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ హెచ్చరించింది. మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్న వారిని, అక్రమ సంపాదనను సక్రమంగా మార్చుకుంటోన్న నల్ల కుబేరుల్ని వదిలిపెట్టేది లేదని, సంబంధిత విభాగాలు వారి కోసం వేటాడుతున్నాయని కేంద్రం ఆర్థిక శాఖ కూడా శుక్రవారం స్పష్టం చేసింది. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు.