ఒక చిన్న రాయి కాలికి గుచ్చుకుంటేనే అమ్మా అంటూ బాధపడతాం. మరి అలాంటిది కంకర రాళ్లపై నిద్ర... అది మండుటెండలో అంటే... కానీ ఇక్కడ మాత్రం ఓ చిన్నారి హాయిగా నిద్రిస్తోంది. అమ్మా ఒడిలో వెచ్చగా సేద తీరాల్సిన చిన్నారికి కంకరరాళ్లే పూల ఊయలగా మారాయి.
రోజు గడవడం కోసం ఎండా.... వాన తేడా లేకుండా అమ్మ రాళ్లను మోస్తుంటే, తన తల్లితో పాటు పని జరిగే ప్రాంతానికి వచ్చిన చిన్నారి రాళ్లనే పాన్పుగా చేసుకొని ఇలా నిద్రిస్తోంది. కష్టజీవులకు రాళ్లైనా, పూలైనా ఒకటే అన్న విషయాన్ని ఈ చిన్నారి పాలుతాగే వయసులోనే జీర్ణించుకున్నట్లుంది. బెంగళూరులోని నాగరబావి ప్రాంతంలో ఈ దృశ్యం 'సాక్షి' కెమెరా కంటికి చిక్కింది.