
ఆయుష్షు పోస్తాం
ఆయుష్‌కు ప్రోత్సాహం అన్ని జిల్లా కేంద్రాల్లో 50 పడకల ఆస్పత్రులు
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్
బెంగళూరు: ఆయుష్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రోత్సాహాన్ని అందజేస్తోందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. బెంగళూరులోని ప్రముఖ ఆయుర్వేద వైద్య చికిత్సా కేంద్రంలో ‘శతాయు ఆయుర్వేద’ 115వ వార్షికోత్సవ సంబరాలతో పాటు ఆసంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘లివర్ కేర్-కొలెస్ట్రాల్ మేనేజ్‌మెంట్’ కేంద్రాలను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్, రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్.సి.మహదేవప్ప గురువారమిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి యు.టి.ఖాదర్ మాట్లాడుతూ.....పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఆయుర్వేదంపై అవగాహనను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పాఠశాలల్లో వివిధ ఔషధ మొక్కల పంపిణీని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 50 పడకల ఆయుష్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మంగళూరు, గదగ్‌లలో ఈ తరహా ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇక ఇదే సందర్భంలో తాలూకా కేంద్రాల్లో 10 పడకల ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటుకు సైతం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శతాయు ఆయుర్వేద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) డాక్టర్ క్రిష్ణ మాట్లాడుతూ.....ప్రస్తుత ఆధునిక జీవన విధానం కారణంగా అనేక విధాలైన వ్యాధులకు మానవుడు లోను కావాల్సి వస్తోందని అన్నారు. వీటి చికిత్స కోసం అలోపతి మందులు వాడుతుంటే, వాటితో మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేద వైద్య విధానం ద్వారా వివిధ వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి స్థాయి చికిత్స అందజేయవచ్చని అన్నారు. ఈ దిశగానే తమ సంస్థ పనిచేస్తోందని వెల్లడించారు.