బిడ్డల్ని కడతేర్చి తల్లి ఆత్మహత్య
సేలం : కన్న తల్లి కర్కశత్వం, కన్న తండ్రి వివాహేతర సంబంధం ముక్కుపచ్చలారని పిల్లల ప్రాణాలను తీసింది. ఓ నిండు కుటుంబాన్ని నిలువునా కూల్చేసిం ది. ఈ హృదయవిదారక సంఘటన ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.ఈరోడ్ జిల్లా చెన్నిమలై ప్రాంతానికి చెందిన వరదరాజన్ (41) బనియన్ కంపెనీలో ఉద్యో గి. ఇతని భార్య సుందరి (30) సైతం అదే బనియన్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ దంపతులకు జనని (11) అనే కుమార్తె, రాజేష్‌కన్నన్ (6) అనే కుమారుడు ఉన్నారు.
మనస్పర్థలతో భార్యాభర్తలు రెండేళ్ల క్రితం విడిపోయారు. సుందరి ఇద్దరి పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటల వరకు సుందరి ఇంటి తలుపులు తెరచుకోలేదు. సమీపంలో నివాసం ఉంటున్న సుందరి తల్లి మోహన కుమార్తె ఇంటికి వెళ్లింది. తలుపులు తీయకపోవడంతో సందేహం కలిగి ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా చిన్నారులు జనని, రాజేష్‌కన్నన్ గొంతుకోసి రక్తపు మడుగులో శవాలుగా పడివున్నారు. సుందరి చీరతో ఉరి వేసుకుని శవంగా వేలాడుతోంది. ఫిర్యాదు అందుకున్న చెన్నిమలై పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనపై చెన్నిమలై పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటాచలం మాట్లాడుతూ బుధవారం రాత్రి సుందరి పక్క వీధిలో నివాసం ఉంటున్న తన తల్లి మోహన ఇంటికి రేషన్‌కార్డు కోసంవెళ్లింది. ఆ సమయంలో తల్లి మోహన, తన భర్త వరదరాజన్ సన్నిహితంగా ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. వారి మధ్య వివాహేతర సంబంధం ఉండడం చూసి విరక్తి చెందిన సుందరి ఇద్దరి పిల్లల గొంతు కోసి హతమార్చి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.