చెళ్లకెరె రూరల్ (కర్ణాటక) :
చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకా హెగ్గెరె వద్ద బీదర్-శ్రీరంగపట్నం రాష్ట్ర రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి చెందాగా, ఐదుగురు గాయపడ్డారు. మృతులను బళ్లారిలోని పార్వతీనగర్‌లో ఉన్న బీసీఎం హాస్టల్ విద్యార్థులుగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. బీసీఎం హాస్టల్ విద్యార్థులు బళ్లారిలోని పరిపూర్ణ ఇన్ఫోటెక్ కంప్యూటర్ సెంటర్‌లో శిక్షణ పొందారు. వీరిని ఇంటర్వ్యూల కోసం సంస్థకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి గురువారం రాత్రి క్రూజర్ వాహనంలో బెంగళూరుకు పిలుచుకెళ్లాడు. బెంగళూరు నుంచి తిరిగి వస్తుండగా క్రూజర్ డ్రైవర్ అజాగ్రత్తతో వాహనం నడిపాడు. ముందు వెళుతున్న ప్రైవేట్ బస్సును అతివేగంగా ఓవర్‌టేక్ చేయబోయాడు. దీంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీకొంది.
వెనుక వస్తున్న ఎస్‌ఆర్‌ఈ బస్సు కూడా అదే వేగంతో క్రూజర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ చంద్రేగౌడ(25), శాంతి(20), సుధ (21), సరిత (22), జయశ్రీ (22), భారతి (20), గిరిజ(19), హర్షిత (16) అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రుతి(20), కావ్య (21) చిత్రదుర్గం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రదీప్, జ్యోతి, నాగరత్న, రేణుక, హులిగమ్మ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం చిత్రదుర్గం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని చిత్రదుర్గం జిల్లా అదనపు ఎస్పీ పరశురాం, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కె.సమీవుల్లా, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటేష్ పరిశీలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం: పది మంది దుర్మరణం
Published Sat, Apr 30 2016 7:56 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM
Advertisement
Advertisement