లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా ఎనిమిది మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
= షేర్ ఆటోను ఢీకొన్న లారీ
= ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా 8 మంది మృతి
= లారీ డ్రైవర్ ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించడం వల్లే ఘటన
బెంగళూరు, న్యూస్‌లైన్ : లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా ఎనిమిది మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘోర ఉదంతం ఆదివారం బీజాపుర జిల్లా, దేవరహిప్పగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీదర్- శ్రీరంగ పట్టణం జాతీయ రహదారిలోని బడేనహళ్లి గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...
సింధగి తాలుకా దేవరహిప్పగి నుంచి 13 మంది షేర్ ఆటోలో సింధగికి బయల్దేరారు. బడేనహళ్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీని దానివెనుకే వస్తున్న మరో లారీ డ్రైవర్ ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించి అదుపు తప్పి ఆటోను ఢీకొట్టాడు. దీంతో లారీ, ఆటో రోడ్డు పక్క పల్లంలోకి దూసుకెళ్లి బోల్తా పడ్డాయి. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దేవరహిప్పగిరి గ్రామానికి చెందిన నబిలాల్ ఇమామ్‌సాబ్ (55), ఖాజాబీ (45), లతీఫ్ నబిసాబ్ (20) (వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు), కానిస్టేబుల్ బసవరాజ్ (40), గంగాబాయి (45), రక్షిత (8), దౌలత్ (10)తోపాటు మరొకరు వృుతి చెందగా మరో ఐదుగరు గాయపడ్డారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను, మృతదేహాలను సింధగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ ఉడాయించారని, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.