విద్యుత్ శాఖా మంత్రి శివకుమార్ హామీ
కేజీఎఫ్ : రైతులకు ఎనిమిది గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి డీ కే శివకుమార్ హామీ ఇచ్చారు. ఆదివారం కేజీఎఫ్ అసెంబ్లీ నియెజకవర్గ పరిధిలోని హుల్కూరు గ్రామం వద్ద 66/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా రూ. 100 కోట్లతో అభివృధ్ది పనులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోలారు జిలా సరిహద్దు ప్రాంతం కావడం వల్ల నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నదని, దీని నివారణ కు పరిశ్రమలు స్థాపించాల్సి ఉందని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ నిర్వహణను ఇతర రాష్ట్రాల అధికారులు కూడా చూసి ప్రశంసించారన్నారు. పారిశ్రామిక వేత్తలు ధైర్యంగా ఈ ప్రాంతానికి వచ్చి పరిశ్రమలను ప్రారంభించవచ్చన్నారు. పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని స్థాపిస్తామని, ఇందులో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. మిగిలిన 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు రైతుల భూముల్లో సౌర ఘటకాలను స్థాపించి ఉత్పాదన చేస్తామన్నారు.
సూర్య మిత్ర పథకంలో భాగంగా రైతులకు రాయితీతో విద్యుత్ ఉత్పాదన ఉపకరణాలను అందిస్తామని, వారు ఉత్పాదన చేసిన విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. భాగ్యలక్ష్మి ఫీడర్ల నుంచి విద్యుత్‌ను నేరుగా తీసుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోతే 24 గంటల్లో మరమ్మత్తు చేయిస్తామన్నారు. రైతుల సమస్యలకు స్పందించని బెస్కాం సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 11, 416 లైన్‌మేన్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ కే హెచ్ మునియప్ప మాట్లాడుతూ బీజీఎంఎల్ ప్రాంతంలోని 12 వేల ఎకరాల్లో పరిశ్రమలను స్థాపించి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రైతులకు 8 గంటల విద్యుత్
Published Mon, Nov 24 2014 2:30 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement