
దీపావళికి 9,088 ప్రత్యేక బస్సులు
దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్లే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం 9,088 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈనెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి :హిందువులతోపాటు భారతీయులంతా సందడిగా జరుపుకునే దీపావళి పండుగ అంటే అందరికీ ఆసక్తే. ముఖ్యంగా తమిళనాడులో దీపావళి పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కొత్తగా పెళ్లైన వధూవరులు తొలివార్షికోత్సవాన్ని ‘తల దీపావళి’గా పిలుచుకుని వైభవంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే పండుగ కావడంతో ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగ స్థానాలను వదిలి స్వస్థలాకు చేరుకునేందుకు ఉరకలేస్తుంటారు. సహజంగా ఒక్కసారిగా బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం 9,088 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల ఏర్పాట్ల పరిశీలనపై ప్రభుత్వం ఒక కమిటీని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో కమిటీగా ఏర్పడిన మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడ్డపాడి కే.పళనిస్వామి, సెంథిల్ బాలాజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు.
గత ఏడాది చేసిన ఏర్పాట్ల స్థాయిలోనే ఈ ఏడాది నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్రం లోని అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ ఈ నెల 17వ తేదీన 501 ప్రత్యేక బస్సులు, 18వ తేదీన 501 ప్రత్యేక బస్సులు, 19వ తేదీన 699, 20వ తేదీన 1,400, 21న 1,652 బస్సుల లెక్కన మొత్తం 4,753 ప్రత్యేక సర్వీసులను నడుపాలని కమిటీలో తీర్మానించారు. అలాగే చెన్నై మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు 17వ తేదీన 499, 18న 601, 19న 700, 20న 1,234, 21న 1,301 బస్సులు నడపనున్నారు. ఈ లెక్కన మొత్తం 4,335 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. అలాగే దీపావళి పండుగ ముగిసిన తరువాత తిరిగి తమ స్థానాలకు చేరుకునేందుకు ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపాలని తీర్మానించారు. చెన్నై నగరంలో సైతం 200 అదనపు సిటీ బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. దీపావళి డిమాండ్‌ను అడ్డుపెట్టుకుని అధిక వసూళ్లకు పాల్పడిన వారిపై 044-24794709 ఫోన్‌కు ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించారు.
చార్జీల దోపిడీ
దీపావళి రద్దీని ప్రైవేటు, ఆమ్ని బస్సు ఆపరేటర్లు ఇష్టారాజ్యం సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టికెట్‌పై 20 నుంచి 50 శాతం వరకు పెంచేశారు. ఉదాహరణకు చెన్నై నుంచి కోవైకికి సాధారణ బస్సు చార్జీ రూ.715, ఏసీ బస్సులో రూ.880 వసూలు చేయాల్సి ఉంది. దీపావళి కావడంతో సాధారణ బస్సు సర్వీసు టికెట్‌ను రూ.1000 నుంచి రూ.1,199లకు పెంచేశారు. పైగా పెంచిన అక్రమ మొత్తాన్ని ధైర్యంగా ఆన్‌లైన్‌లోనే పొందుపరుస్తున్నారు. మిగిలిన ప్రాంతాలకు వె ళ్లే బస్సు సర్వీసుల్లోనూ ఇదే పరిస్థితి. అన్‌లైన్ ద్వారా బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా రవాణాశాఖ నుంచి అడిగేవారే లేరని ప్రయాణికులు వాపోతున్నారు.