
ఎస్‌బీఐ క్యాష్ వ్యాన్‌ను కొల్లగొట్టారు
ముంబై: ఏటీఎంలలో నగదు లేక సామాన్యులు కరెన్సీ కష్టాలు పడుతుండగా.. కొన్నిచోట్ల సిబ్బందే ఏటీఎంల నుంచి డబ్బు కాజేయడం, దొంగలు ఏటీఎంలను లూటీ చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలో గుర్తు తెలియని దుండగులు ఎస్‌బీఐ క్యాష్ వ్యాన్ నుంచి దాదాపు కోటి 50 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు.
ఆసియాలోనే అతి పెద్ద స్లమ్ ఏరియా, ముంబైలోని ధారవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎస్‌బీఐకు చెందిన నగదును వ్యాన్‌లో తీసుకెళ్తుండగా, నలుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.