సాక్షి, ఢిల్లీ : కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందన్న వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. ఒకప్పుడు రాష్ర్టంలో అత్యధిక కేసులు ప్రబలిన మురికవాడ ధారావిలో కరోనా నియంత్రణ కాలేదా అంటూ ప్రశ్నించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం ఈ విషయంలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) చేసిన ప్రయత్నాలను ప్రశంసించిందన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమయ్యిందని పలువురు పార్లమెంటు సభ్యులు మహారాష్ర్ట సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. (సరిహద్దుల్లో పంజాబీ సాంగ్స్.. చైనా మరో కుట్ర)
ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ..కరోనాను అదుపు చేయకపోతే ఇంతమంది ఎలా కోలుకోగలిగారు? ఇప్పుడు కరోనాను జయించిన వాళ్లందరూ పాపడ్ తిని కరోనా నుంచి బయటపడ్డారా అంటూ వ్యంగాస్ర్తాలు సంధించారు. గతంలో పాపడ్ తింటే కరోనా పోతుందని ఉచిత సలహా ఇచ్చి విమర్శలపాలైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కరోనాకు గురైన సంగతి తెలిసిందే. తన తల్లి, సోదరుడు సైతం కోవిడ్ బారినపడ్డరని రాష్ర్టంలో రికవరీ రేటు ఎక్కువగానే ఉందని సంజయ్ రౌత్ తెలిపారు. కరోనాను రాజకీయం కోసం వాడుకోరాదంటూ పేర్కొన్నారు. ఇక దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ర్ట మొదటిస్థానంలో ఉంది. రాష్ర్టంలో కోవిడ్ తీవ్రత బుధవారం నాటికి 1.12 మిలియన్ మార్కును దాటేసింది. వీరిలో దాదాపు ఎనిమిది లక్షలమంది కరోనాను జయించారు. గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 51,18,254కు చేరుకుంది. (దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment