నటుడి కుమారుడు అరెస్టు
తమిళసినిమా: స్థానిక సీఐటీ కాలనీలో అర్ధరాత్రి మినీ విమానాన్ని రిమోట్ ద్వారా ప్రయోగించిన నటుడు పాండియరాజన్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... మినీ విమానాలను విహరింపజేయడంపై చెన్నైలో నిషేధం అమల్లో ఉంది. గత ఏడాది స్థానిక ఎంఆర్‌సీ.నగర్ సమీపంలోని ఒక నక్షత్ర హోటల్ పైభాగం నుంచి మినీ విమానం ఒకటి ఆకాశంలోకి ఎగిరింది.
దీంతో హోటల్‌లో బసచేసిన విదేశీ పర్యాటకులు భయబ్రాంతులకు గురయ్యారు. దానిని తీవ్రవాదుల చర్యలుగా భావించి ఆందోళ న చెందారు. దీనిపై పట్టణం పాక్కమ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ మినీ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో ఆ మినీ విమానాన్ని రిమోట్ ద్వారా ఎగురవేసింది ఎంఆర్‌సీ.నగరానికి చెందిన మదన్‌రాజ్ అని తెలియడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇలా ఉండగా ఆదివారం అర్ధరాత్రి స్థానిక సీఐటీ నగర్‌లో మినీ విమానం ఆకాశంలో విహరించింది. అందులో కెమెరాతో పాటు సాంకేతిక పరికరాలు పొందుపరిచి ఉన్నాయని, ఎవరో సీఐటీ నగర్ ప్రాంతంపై నిఘా వేస్తున్నట్లు ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఈ సంఘటన గురించి మైలాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జాయింట్ పోలీస్ కమిషనర్ బాల కృష్ణన్ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి మినీ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఆ మినీ విమానాన్ని రిమోట్ ద్వారా ఆకాశంలోకి విహరింపజేసింది నటుడు పాండియరాజన్ కొడుకు ప్రేమ్‌రాజన్ అని తెలిసింది. ఆతన్ని విచారించగా షూటింగ్‌ల కోసం తయారు చేసిన మినీ విమానాన్ని టెస్ట్ చేయడానికి స్నేహితులతో కలిసి ఆకాశంలో విహరింపజేసినట్టు పేర్కొన్నాడు.
ప్రేమ్‌రాజన్ టీ నగర్‌లో నివసిస్తుండగా సీఐటీ.నగర్‌లో ఎందుకు మినీ విమానాన్ని ప్రయోగించారన్న ప్రశ్నకు టీనగర్‌లో జన సంచారం అధికంగా ఉంటుందనీ, అందువల్ల అంతరాయం కలగకుండా సీఐటీ.నగర్‌లో ఎగురవేసినట్లు తెలిపారు. అతని సమాధానం పోలీసులకు సంతృప్తినివ్వకపోవడంతో ప్రేమ్‌రాజన్‌ను అరెస్ట్ చేసి అనంతరం సొంత పూచికత్తులో విడుదల చేశారు.