అవకాశాలొస్తే నటిస్తా
నటి రాజశ్రీని తమిళసినిమా అంత తొందరగా మరిచిపోయి ఉంటుందనుకోలేము. కారణం ప్రముఖ దర్శకుడు భారతీరాజా పరిచయం చేసిన కథానాయికల్లో ఈమె ఒకరు. 1994లో కరుత్తమ్మ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన రాజశ్రీ తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా రాష్ట్రప్రభుత్వ అవార్డును అందుకున్నాను. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఈమె హీరోయిన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటించి తన ప్రత్యేకతను చాటుకున్న రాజశ్రీ 60కి పైగా చిత్రాలు, 50కిపైగా సీరియల్స్ చేశారు.
అయితే వివాహానంతరం నటనకు గ్యాప్ ఇచ్చిన రాజశ్రీ తాజాగా రీఎంట్రీ అయ్యారు. ఇంతకు ముందు బాలా దర్శకత్వం వహించిన నందా చిత్రంలో సూర్యకు తల్లిగా నటించి మెప్పించిన రాజశ్రీ ఇప్పుడు అదే దర్శకుడు బాలా నిర్మిస్తున్న తాజా చిత్రం చండీవీరన్ చిత్రంలో నటుడు అధర్వకు అమ్మగా నటించడం విశేషం. తల్లీ కొడుకుల అనుబంధం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడదలకు సిద్ధం అవుతోంది.ఈ చిత్రం మళ్లీ చిత్రపరిశ్రమ దృష్టిని తనపై తిప్పేలా చేస్తుందనే నమ్మకాన్ని రాజశ్రీ వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంచి అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధం అని అన్నారు.