
జయకు శుభాకాంక్షల వెల్లువ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏళ్ల తరబడి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిగా విడుదల కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆమెతో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య బొకే పంపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏళ్ల తరబడి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను వెంటాడింది. మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినా ఆ కేసులతో సతమతంకాక తప్పలేదు. 2014 సెప్టెంబరు 27న బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మైకెల్ డి గున్హా ఇచ్చిన తీర్పు జయలలిత రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. సీఎం, ఎమ్మెల్యే పదవికి అనర్హురాలుగా మిగిలారు. ఇక తమ అమ్మను మళ్లీ సీఎంగా చూస్తామా అన్న మనో వేదనతో ఆలయాల్లో పూజలు, యాగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన అన్నాడీఎంకే వర్గాలకు 2015 మే 11న ఓ శుభ దినమే.
తమ అమ్మ నిర్దోషి అంటూ కోర్టు ఇచ్చిన తీర్పుతో అన్నాడీఎంకే వర్గాలు ఆనందడోలికల్లో మునిగారు. అమ్మను చూడాలన్న ఆశతో పోయెస్ గార్డెన్‌కు పరుగులు తీసి శుభాకాంక్షలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్ర మోది ఆమెకు ఫోన్లో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్‌ప్రసాద్, నజ్మా, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే.వాసన్, ఎండీఎంకే అధినేత వైగో, సీపీఐ జాతీయ నేత అతుల్ కుమార్ అంజన్, దేశీయవాద కాంగ్రెస్ నేత శరద్‌పవార్ జయలలితకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలి యజేసిన వారిలో ఉన్నారు.
రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రో శయ్య జయలలితకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఒక బొకేను పోయెస్ గార్డెన్‌కు పంపిం చారు. ఇక అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, పార్లమెంట్ డెప్యూటీ స్పీకర్ తంబిదురై జయలలితను కలుసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని మదుసూదనన్, పార్టీ క్రమశిక్షణ సంఘం నే త, సీఎం పన్నీరు సెల్వంతో పాటు సీనియర్ మంత్రు లు కోరినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.