- ఒక ఇడ్లీ - రూ. 1
- రెండు చపాతీలు - రూ.3
- పెరుగన్నం - రూ.3
- చిత్రాన్నం, పులిహోరం - రూ.5
అనంతపురం సప్తగిరిసర్కిల్: తమిళనాడులో నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల తరహాలో మన రాష్ట్రంలో కూడా నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే క్యాంటీన్ల విషయమై శుక్రవారం స్థానిక డ్వామా సమావేశ మందిరంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, సమాచార ప్రసారశాఖ, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి జిల్లా అధికారులు, హిందూపురం ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, నగర మేయర్ మదమంచి స్వరూప, ఇస్కాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. నగరంలో ప్రభుత్వాస్పత్రి, ఆర్టీసీ బస్టాండ్, తాడిపత్రి బస్టాండ్, టవర్‌క్లాక్, రుద్రంపేట ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్యాంటీన్లలో ఆహారపదార్థాల ధరలు, తాగునీరు, పరిశుభ్రత, నిర్వహణకు సంబంధించి ఇస్కాన్ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
ప్రతి క్యాంటీన్ వద్ద వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకుని రక్షిత నీరు అందచేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రత పాటించాలన్నారు. పార్శిల్ సదుపాయం లేదన్నారు. అక్టోబర్ 2న వీటిని ప్రారంభించాల్సి ఉంది. అయితే మరోసారి తమిళనాడుకు వెళ్లి అక్కడి అమ్మ క్యాంటీన్లను పరిశీలించాల్సి రావడంతో వీటి ప్రారంభంలో కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 16న మంత్రి పరిటాల సునీత, కలెక్టర్, ఇస్కాన్ ప్రతినిధులు చెన్నైకి వెళ్లనున్నారు. అనంతరం అన్న క్యాంటీన్ల ప్రారంభించేందకు చర్యలు చేపడతారు.
అనంతపురంలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు రాగిముద్ద, నీళ్లపప్పు, ఇడ్లీ, సాంబార్, పొంగల్ (రోజుకోరకం), మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు చిత్రాన్నం, పప్పున్నం, పులిహోరలలో ఒకటి, పెరుగన్నం, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు చపాతీలు పెట్టాలని సూచించారు. ఇందులో ఒక్కో ఇడ్లీ ఒక రూపాయి చొప్పున, రెండు చపాతీలు రూ.3 ప్రకారం, ముద్దపప్పు, చిత్రాన్నం, పులిహోరం రూ.5 చొప్పున, పెరుగన్నం రూ.3 ప్రకారం విక్రయించాలని సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులకు సూచించారు.
కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, పౌరసరఫరాలశాఖ డీఎం వెంకటేశం, డీఆర్‌డీఏ పీడీ కె.నీలకంఠారెడ్డి, డీఎస్‌వో ఉమామహేశ్వర్‌రావు, ఆర్డీవో షేక్‌హుస్సేన్, మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రతాప్‌రుద్ర, తహశీల్దార్, సీఎస్‌డీటీలు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.