వ్యవసాయ వర్శిటీ తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాస్తారోకో
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాయచూరులో,తాలూకా కేంద్రాల్లో గురువారం రాస్తారోకో చేశారు. రాయచూరులో ఏడో మైలు క్రాస్ వృత్తం వద్ద ఏఐఆర్‌డబ్ల్యూ, ఏఐఆర్‌ఎస్‌ఓ, ఆర్‌వైఎఫ్‌వై నేతృత్వంలో దాదాపు 15 నిమిషాల పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు మానసయ్య ,రాజశేఖర్ , నూర్‌జహాన్ తదితరులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక రైతు సంఘం రాష్ట్రధ్యక్షడు మానసయ్య మాట్లాడుతూ రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 20 ఏళ్ల నుంచి తాత్కాలిక ఉద్యోగులుగా విధులు నిర్వహించిన వారిని తొలగిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి బి.వి.పాటిల్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.తాత్కాలిక ఉద్యోగులు 8 రోజుల నుంచి జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నా విశ్వవిద్యాలయం పాలకమండలి స్పందించలేదని విమర్శించారు. వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.