రంగంలోకి ‘అమ్మ’ | AIADMK chief jayalalithaa Focus in Government ruleing | Sakshi
Sakshi News home page

రంగంలోకి ‘అమ్మ’

Published Mon, Dec 15 2014 2:43 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM

రంగంలోకి ‘అమ్మ’ - Sakshi

రంగంలోకి ‘అమ్మ’

అప్పీలు పిటిషన్ దాఖలు వ్యవహారాల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రభుత్వ పాలన, పార్టీ మీద అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దృష్టి పెట్టారు. ప్రభుత్వ వ్యవహారాల్ని, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పరిశీలించే పనిలో తలమునకలై ఉన్నారు. పలువురు మంత్రుల్ని పిలిచి క్లాస్ పీకడంతో పాటుగా వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి హెచ్చరించి పంపినట్టు సంకేతాలు     వెలువడుతున్నాయి.
 
 సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అండ్ బృందానికి జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన జయలలిత పోయేస్ గార్డెన్‌కు పరిమితమయ్యారు. సీఎం పన్నీరు సెల్వం, నలుగురు మంత్రులతో తప్ప, మిగిలినెవ్వరితోను సంప్రదింపులు జరపడం లేదు. అవసరం అనుకుంటే ఆ నలుగురు మంత్రుల్ని పోయేస్ గార్డెన్‌కు పిలిపించడం లేకుంటే పన్నీరు సెల్వం, సలహాదారు  షీలా బాలకృష్ణన్‌తో మాత్రమే సమీక్షిస్తున్నారు. జయలలిత ప్రభుత్వ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టని దృష్ట్యా, పన్నీరు ప్రభుత్వం గాడి తప్పిందంటూ ప్రతిపక్షాలు విమర్శించే పరిస్థితులు నెలకొన్నాయి.
 
 రంగంలోకి.. : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ అప్పీలు పిటిషన్ దాఖలు చేసే పనిలో జయలలిత ఇన్నాళ్లు నిమగ్నమయ్యూరు. వేలాది పేజీలతో కూడిన అప్పీలు పిటిషన్‌లోని వివరాలన్నీ పరిశీలించాల్సి రావడంతో జయలలిత ప్రభుత్వ వ్యవహారాల్లో ఇన్నాళ్లు పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోలేక పోయారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా, కర్ణాటక హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయడంతో ఇక, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు ఆమె సిద్ధమయ్యారు. అప్పీలు పిటిషన్ దాఖలు సజావుగా ముగియడంతో మంత్రులు, పార్టీ వర్గాల పని తీరును పరిశీలించడం మొదలెట్టారు. సీఎం పన్నీరు సెల్వం, సలహాదారులు షీలా బాలకృష్ణన్, రామానుజం, మంత్రులందర్నీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మరుసటి రోజు రాత్రి పోయెస్ గార్డెన్‌కు పిలిపించారు.
 
 క్లాస్ : ప్రభుత్వ వ్యవహారాలను పరిశీలించి, ప్రభుత్వ ఆదాయం పెంపు లక్ష్యంగా కొన్ని సూచనల్ని సలహాల్ని ఇచ్చారు. కుంటు పడ్డ పథకాల్ని కొనసాగించేందుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకునే రీతిలో సూచించారు. కొందరు మంత్రుల పనితీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని ఆమె వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఆనందన్, షణ్ముగనాథన్‌ను తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. చక్కెర పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టని మంత్రి తంగమణి, తమ తమ శాఖల్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటూ మంత్రులు వలర్మతి, పూనాక్షిలను మందలించారు.
 
 అలాగే , పార్టీ సంస్థాగత ఎన్నికలపై జిల్లాల వారీగా సమాచారం సేకరించిన జయలలిత ఏదేని వివాదాలు బయలు దేరినా, ఘర్షణలు చోటు చేసుకున్నా మూకుమ్మడిగా అందర్నీ బయటకు పంపించాల్సి ఉంటుందని ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులకు హెచ్చరికలు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ అమ్మ జయలలిత పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల మీద దృష్టి పెట్టడంతో  నెలరోజుల వ్యవధిలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరెవ్వరు ఏఏ తప్పులు చేశారో వాటిని ఫిర్యాదుల రూపంలో జయలలితకు పంపిం చేందుకు పలువురు నాయకులు సిద్ధమయ్యారు. జయలలిత కొందరు మంత్రుల్ని తీవ్రంగా మందలించిన సంకేతాలతో త్వరలో మంత్రి వర్గం లో మార్పులు తప్పని సరి..! అన్న చర్చ అన్నాడీఎంకేలో మొదలైంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement